కరోనా నేపథ్యంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం
భోపాల్: కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థల బంద్‌లు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలోనే మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న విద్యాసంవత్సరం నాటి వరకూ పాఠశాలలను తెరవకూడదని నిర్ణయం తీసుకుంది. కేవలం 10, 12వ తరగతుల విద్యార్థులకు మాత్రమే తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పాఠశాలల బంద్‌ను మార్చి 31 వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు నిర్వహించబోమని, వారు చేపట్టిన ప్రాజెక్టు వర్కుల ఆధారంగానే మార్కులు ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారమే 10, 12వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 9, 11వ తరగతి విద్యార్థులకు వారం లేదా రెండు వారాలకు ఒకరోజు తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. రానున్న విద్యాసంవత్సరాన్ని 2021 ఏప్రిల్‌లో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.