సీఎం ఇంటికి బాంబు బెదిరింపు కాల్‌

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ఇంట్లో బాంబు పెట్టానని బెదిరింపునకు పాల్పడిన ఆటోడ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై పోలీసు కంట్రోల్‌ రూమ్‌కు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి సీఎం ఇంట్లో బాంబు పెట్టినట్లు, మరికొద్దిసేపట్లో పేలుతుందని తెలిపి ఫోన్‌ కట్‌ చేశాడు. దీంతో బాంబ్‌ స్క్వాడ్‌ నిపుణులు స్థానిక అడయార్‌ గ్రీన్‌వేస్‌ రోడ్డులోని ముఖ్యమంత్రి ఇంటికి చేరుకుని గంటన్నర పాటు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి, బాంబు లేదని నిర్ధారించారు. దీంతో ఫోన్‌ చేసిన వ్యక్తి ఆ సెల్‌ఫోన్‌ నెంబరు ఆధారంగా తాంబరం సమీపంలోని సేలయూర్‌కు చెందిన ఆటో డ్రైవర్‌ వినోద్‌కుమార్‌ (33) అని గుర్తించారు. ఆయనను అదుపులోకి తీసుకుని విచారించగా, భార్యతో ఏర్పడిన ఘర్షణతో ఆగ్రహంతో ఇలా చేశానని, 2019లోనూ ఇలా రెండుసార్లు ఇలాగే చేశానని అంగీకరించినట్టు తెలిసింది.