పింఛన్ తీసుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం వర్తించదని ప్రభుత్వం నిబంధనల్లో పేర్కొంది. దీంతో వితంతు, ఒంటరి మహిళలు ఆందోళన చెందుతున్నారు. సాధారణ మహిళల కంటే లక్ష్య సాధనలో వీరికి సవాళ్లు ఎక్కువ. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో భార్యాభర్తలు కలిసి పని చేస్తేనే సంసారం ఈదడం కష్టమవుతున్న తరుణంలో ఒక్కరి కష్టంతో నెట్టుకు రావడానికి ఎంతో ధైర్యం కావాలి. మన సమాజంలో ఒంటరి, వితంతు మహిళల్లో రెక్కల కష్టం మీద ఆధారపడిన వాళ్లే ఎక్కువ. కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ వీరి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపింది. జీవనోపాధి కోల్పోయి అప్పుల పాలయ్యారు. కాబట్టి వాస్తవ పరిస్థితిని గుర్తించి 'వైఎస్సార్ చేయూత' పథకాన్ని వితంతు, ఒంటరి మహిళలకూ వర్తింపజేయాలి. ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్లకు రూ.75 వేలు అందించి కరోనా కష్టకాలంలో అండగా నిలవాలి. ఆగస్టు 12వ తేదీన లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుకు విధివిధానాలు రూపొందించే క్రమంలో శ్రమ జీవుల కుటుంబాల్లో కరోనా వైరస్, లాక్‌డౌన్ సృష్టించిన ఆర్థిక సంక్షోభాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
వారికీ వైఎస్సార్ చేయూత!