ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారంతా సూచనలు, నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్. శ్రీకాంత్ తెలిపారు. సరిహద్దుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షల్లో నెగిటివ్ వస్తే 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌కు, పాజిటివ్ వస్తే ప్రభుత్వ క్వారంటైన్ వెళ్లాలన్నారు. అలాగే వ్యాధిగ్రస్తులకు కూడా ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
రైలు, విమాన ప్రయాణికులకు ఇలా...
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ నుంచి వచ్చే రైలు ప్రయాణికులందరికీ టెస్టులు చేయబడతాయని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి క్వారంటైన్‌కి పంపిస్తామని శ్రీకాంత్ తెలిపారు. మెడికల్ టెస్ట్ రైల్వే స్టేషన్‌లో కానీ.. డిస్ట్రిక్ట్ రిసెప్షన్ సెంటర్‌లో కానీ నిర్వహిస్తామన్నారు. ఇక విదేశాల నుంచి వచ్చే వారంతా తప్పనిసరిగా ప్రభుత్వ లేదా పెయిడ్ క్వారంటైన్‌కి వెళ్లాలని సూచించారు. ఈ కదలికల వలన రాష్ట్ర ప్రజలందరూ మరింత అప్రమత్తంగా ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి.. మాస్కు ధరించాలి.. ప్రభుత్వం సూచించిన అన్ని మార్గదర్శకాలను పాటించాలని కోరారు.
పోలీసు శాఖ ఆదేశాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్రాష్ట్ర కదలికలపై తదుపరి నిర్ణయం తీసుకొనేంత వరకు షరతులు కొనసాగుతాయని ఏపీ డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రోడ్డు మార్గాన ఆంధ్రప్రదేశ్ రావాలనుకునే ప్రయాణికులు ఖచ్చితంగా స్పందన పోర్టల్ ద్వారా ఈ-పాస్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. కరోనా ప్రభావం తక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు మాత్రం 7 రోజులు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి.. నెగిటివ్ వస్తే 7రోజులు హోం క్వారంటైన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉందని డీజీపీ పేర్కొన్నారు.