మందుబాబులకు మరో షాక్..

ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం మరో షాకింగ్ న్యూస్ ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే 75 శాతం మద్యం ధరలు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. అయినా కూడా లిక్కర్ కోసం ప్రజలు ఎగబడ్డారు. కానీ, రెండో రోజు ఆ పరిస్థితి లేదు. రద్దీ తగ్గింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లిక్కర్ షాపులను 33శాతం మేర తగ్గింది. రాష్ట్రంలో వాస్తవానికి 4380 లిక్కర్ షాపులు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేవి. వాటిని 3500కు గతంలోనే తగ్గించారు. ఇప్పుడు వాటిని 2934కు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చేదిశగా ముందుకు వెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మద్యం దుకాణాలను తగ్గించినట్టు ఎక్సైజ్ శాఖ ప్రకటన జారీ చేసింది. తగ్గించిన షాపుల్లో ఏ జిల్లాల్లో ఎన్ని దుకాణాలను తగ్గించారు, ఏయే దుకాణాలను తగ్గించారనే వివరాలను ప్రభుత్వం త్వరలో తెలియజేయనుంది.