రాష్ట్రాన్ని ఆదుకోండి


లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా సతమతమవుతున్న రాష్ట్రాన్ని తక్షణం ఆదుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కోరారు. గురువారం ప్రధాని మోదీకి రాసిన లేఖలో రాష్ట్రంలోని పలు అంశాల గురించి ప్రస్తావించారు. ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా పారిశ్రామికరంగాన్ని ఆదుకోవాలని కోరారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను గట్టెక్కించే చర్యలు తీసుకోవాలన్నారు. ఆటోమొబైల్‌, వస్త్ర, ఫార్మా, లోహ, గనుల, ఆహారశుద్ధి రంగాలను ఆదుకోవాలని సీఎం  విజ్ఞప్తి చేశారు. పారిశ్రామిక రంగానికి కావాల్సిన ప్రోత్సాహకాల గురించి తన 10పేజీల లేఖలో వివరించారు. ఏపీ పారిశ్రామిక ఉత్పత్తి రూ.72,523కోట్లుగా ఉందని, రాష్ట్ర స్థూల విలువ జోడింపులో ఇది 11.83 శాతాన్ని ఆక్రమిస్తోందన్నారు. దేశ ఎగుమతుల్లో ఫార్మా, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు, చేనేత, వస్త్ర పరిశ్రమలు కీలక భూమిక పోషిస్తున్నాయని వివరించారు. 
2018-19 ఆర్థిక సంవత్సరంలో ఏపీ నుంచి రూ.98,983 కోట్ల ఎగుమతులు జరిగాయని పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చులు, వర్కింగ్‌ క్యాపిటల్‌ విషయంలో రాష్ట్రానికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంఎస్‌ఎంఈలు చెల్లించాల్సిన రుణ వాయిదాలను మరో మూడు నెలలు నిలిపివేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి ఎంఎస్‌ఎంఈలకు వర్క్‌ ఆర్డర్లు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని, అలాగే వాటి బకాయిలను తక్షణమే చెల్లించే సదుపాయం ఇవ్వాలని కోరారు. విద్యుత్తు ఛార్జీలను మాఫీ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వస్త్ర పరిశ్రమలకు సంబంధించిన బ్యాంకు వడ్డీలను తగ్గించి, కాటన్‌ యార్న్‌ ఫ్యాబ్రిక్స్‌కు సంబంధించి కేంద్ర పన్నుల్లో రిబేటు కల్పించాలని కోరారు. ఏపీలో పెద్ద సంఖ్యలో ఆటోనగర్‌లు ఉన్నందున ఆటోమొబైల్‌ పరిశ్రమలకు ఉద్దీపనలు ప్రకటించాల్సిన అవసరం ఉందని సీఎం జగన్‌ లేఖలో ప్రస్తావించారు. ఆటోనగర్‌లు ఎక్కువ మంది ప్రజల ఆదాయ మార్గంగా సేవలందిస్తున్నాయని, కావున నగదు లావాదేవీలు పెంచేందుకు జీఎస్టీ చెల్లింపులకు విరామం ప్రకటించాల్సిందిగా కోరారు.
రుణాలపైనా మారటోరియం విధించేలా కేంద్ర చర్యలు చేపట్టాలని సూచించారు. ఫార్మా రంగాన్ని ఆదుకునేందుకు తాత్కాలిక చర్యలు తీసుకోవాలన్నారు. ఔషధ ముడిసరకు రవాణాపై మార్గదర్శకాలిచ్చి, కస్టమ్‌ క్లియరెన్సులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ పైప్‌లైన్‌ ప్రాజెక్టులో భాగంగా తక్షణమే నిధులు ఇవ్వాలని కోరారు. లోహ, గనుల రంగానికి సంబంధించి పన్నుల సరళీకరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆహారశుద్ధికి సంబంధించి వర్కింగ్‌ క్యాపిటల్‌ను రుణంగా అందుబాటులో ఉంచాలన్నారు. ఎగుమతి ఆధారిత వాణిజ్యానికి ఉద్దీపనలు ప్రకటించాలని కోరారు. పరిశ్రమల ప్రగతితో దేశాభివృద్ధిలో ఏపీ కూడా భాగస్వామిగా మారేందుకు సాయం చేయాలని కోరారు. మేకిన్‌ ఇండియా నినాదాన్ని విజయవంతం చేద్దామని జగన్‌ ఉద్ఘాటించారు.