కంటైన్మెంట్, బఫర్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లోనూ దుకాణాలు తెరుచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు తెరచుకునే అవకాశమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నగర, పట్టణ ప్రాంతాల్లో ఓ క్రమ పద్ధతి ప్రకారం దుకాణాలు తెరచుకునేందుకు అనుమతిచ్చింది. తెరచిన రెండు దుకాణాల మధ్య మరొకటి మూసివేసి ఉంచాల్సిందిగా సూచించింది. రద్దీని నివారించేందుకు ఈ విధానం పాటించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్లు, అధికారులు రోస్టర్ విధానం పాటించాలని సూచించింది.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పట్టణ ప్రాంతాల్లోని షాపింగ్ మాల్స్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. పట్టణ ప్రాంతాల్లోని సినిమాహాళ్లు, మార్కెట్ కాంప్లెక్సుల నిర్వహణకు అనుమతి లేదు. అయితే పట్టణ ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ కాంప్లెక్సుల్లోని దుకాణాలు తెరిచేందుకు అవకాశమిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని మాల్స్, దుకాణాలపై ఎలాంటి ఆంక్షలు లేవు. కరోనా తీవ్రత ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిత్యావసర దుకాణాలకు మాత్రమే అనుమతి కల్పించింది. నిర్మాణ రంగ కార్యక్రమాలు, విత్తనాలు, పంపుసెట్ల విక్రయాలకు అనుమతి ఉంది. దుకాణాల వద్ద కనీసం 6 అడుగుల భౌతిక రూపం పాటించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోని నిత్యావసర, ఇతర దుకాణాలకూ అనుమతి మంజూరు చేసింది.