కరోనా వైరస్‌ను ఎదుర్కొనే విషయంలో ఇతర రాష్ట్రాల కంటే భిన్నంగా పనిచేయగలిగామని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. కొవిడ్ పరీక్షల పరంగా చూస్తే దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని.. ప్రతి 10లక్షల జనాభాకు 2500కి పైగా పరీక్షలు చేస్తున్నామని, ఇది ఒక రికార్డు అని చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నివారణ చర్యలతో పాటు ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయం, తాగునీరు, నాడు-నేడు, గృహనిర్మాణం, ఉపాధి హామీ అంశాలపై జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణ విషయంలో కలెక్టర్లు, ఎస్పీలు చక్కటి పనితీరు కనబరిచారని సీఎం అభినందించారు.
35రోజుల క్రితం రాష్ట్రంలో తిరుపతి స్విమ్స్ తప్ప మరెక్కడా కరోనా పరీక్షలు చేసే సౌకర్యం లేదని.. అక్కడ కూడా రెండు రోజుల తర్వాత ఫలితాలు వచ్చేవని జగన్ గుర్తు చేశారు. ప్రస్తుతం 11 జిల్లాల్లో పరీక్షలు చేసే ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. ట్రూనాట్ కిట్లు సైతం అన్ని ఆస్పత్రుల్లో ఉన్నాయని వివరించారు. గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల రూపంలో మనకు బలమైన నెట్‌వర్క్ ఉందన్నారు. కరోనాను ఎంత కట్టడి చేయాలనుకుంటున్నా.. అది ఎక్కడో ఓ చోట కనిపిస్తోందన్నారు. కరోనా జీవితంలో భాగమని.. దానితో కలిసి జీవించాల్సి ఉంటుందని సీఎం పునరుద్ఘాటించారు. కరోనా మరణాల రేటు కేవలం 2 శాతంలోపే ఉందన్నారు. వయసు పైబడిన వారు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిపైనే ఇది ప్రభావం చూపుతోందని చెప్పారు.
కనీసం లక్ష మందికి క్వారంటైన్ సదుపాయం కల్పించాలి
ఇతర రాష్ట్రాల్లో ఉన్న వలస కార్మికులు ఏపీకి తిరిగి వస్తున్నారని.. వాళ్లకు క్వారంటైన్ సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సీఎం జగన్ చెప్పారు. లక్షకు పైగా వలస కూలీలు, మరో లక్ష మంది ఇతరులు కూడా వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. వివిధ దేశాల నుంచి కూడా మన రాష్ట్రానికి చెందిన వారు వస్తున్నారని.. అందుకే స్థిరంగా ప్రభుత్వం తరఫున కొన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. దాదాపు 11 వేలకు పైగా ఉన్న గ్రామ సచివాలయాల్లో కనీసం లక్ష మందికి క్వారంటైన్ సదుపాయాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సీఎం చెప్పారు. ప్రస్తుతం ఉన్న క్వారంటైన్ కేంద్రాల్లో అన్ని సదుపాయాలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలన్నారు. ఆయా కేంద్రాల్లో సదుపాయాలపై రోజూ సమీక్ష నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను సీఎం ఆదేశించారు. పీహెచ్‌సీ పరిధిలో ఒక ద్విచక్ర వాహనాన్ని, థర్మల్ బాక్సును అందుబాటులోకి తీసుకురావాలని జగన్ సూచించారు. 24 గంటల్లోపు ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు సరఫరా చేయాలన్నారు. త్వరలో విలేజ్ క్లినిక్ ప్రారంభమవుతుందని.. అప్పుడు టెలీ మెడిసిన్ మరింత బలోపేతమవుతుందని చెప్పారు. ఈ వ్యవస్థను కలెక్టర్లు తమదిగా భావించి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్దేశించుకున్న కంటైన్‌మెంట్ క్లస్టర్లపై దృష్టి పెట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. అనంతరం ఖరీఫ్ సీజన్ వ్యవసాయంపై జగన్ సమీక్ష నిర్వహించారు.