వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మే 30వ తేదీన రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని తీసుకురావడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. 2019 మే 30న సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఏడాది మే 30వ తేదీకి ఆయన సీఎంగా ఏడాది పాలన పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఏపీలో రైతు భరోసా కేంద్రాలు ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నారు అధికారులు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యలు, ఇతర అంశాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, వ్యవసాయశాఖమంత్రి కన్నబాబు, అగ్రిమిషన్ వైస్ ఛైర్మన్ నాగిరెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్యారోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సహా ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మే 30న రైతు భరోసా కేంద్రాలు ప్రారంభానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. ఈలోగా మార్కెట్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేయాలని వారికి సీఎం జగన్ సూచించారు. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డుల ఏర్పాటుపై విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించారు. వీటిని ఆర్బేకేలకు అనుసంధానం చేయాలన్నారు.
అలాగే జూన్ 6న మత్స్యకార భరోసాకు సిద్ధం అయ్యామని అధికారులు తెలిపారు. రైతు భరోసాకు సంబంధించి గ్రామ సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ఉంచుతున్నామని, ఎవరైనా పేరులేకపోతే దరఖాస్తు చేసుకునేలా ప్రచారం చేస్తున్నామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలవద్ద ధాన్యం తేమకొలిచే సాధనాలను అందుబాటులో ఉంచాలని, వీటిని ప్రతి రైతు భరోసా కేంద్రంవద్ద ఉంచాలని సీఎం జగన్ ఆదేశించారు.