విద్యుత్ వినియోగదారులకు బిగ్ రిలీఫ్..

విద్యుత్ వినియోగదారుల నుంచి మార్చి, ఏప్రిల్‌ నెలలకు సంబంధించిన బిల్లులు అదనంగా వసూలు చేయబోమని ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌ కో సీఎండీ నాగుల శ్రీకాంత్‌ వెల్లడించారు. బుధవారం సీఎండీ శ్రీకాంత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన కరెంటు బిల్లులు కలిపి ఇస్తారని వస్తున్న వార్తలు కేవలం అపోహలు మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే ఇందులో ఎలాంటి అపోహలు అవసరం లేదని, రెండు బిల్లులు విడివిడిగా లెక్క కట్టినట్లు స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా మార్చిలో 46 శాతం, ఏప్రిల్‌లో 54 శాతం వినియోగం ఉంటుందని, అందుకే ఏప్రిల్‌లో అధికంగా ఉన్న నాలుగు శాతాన్ని మార్చిలో కాలిపినట్లు చెప్పారు.


దీంతో రెండు నెలకు 50 శాతంగా లెక్క కట్టి బిల్లులు ఇవ్వడంతో స్లాబ్‌ మారే అవకాశం లేదని సీఎండీ శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఏప్రిల్‌లో అదనంగా వచ్చిన యూనిట్లను మార్చిలో కలిపామని, అయితే మార్చికి, ఏప్రిల్‌కు బిల్లులు విడివిడిగానే ఎస్‌ఎంఎస్‌లు పంపుతామని స్పష్టం చేశారు. మార్చి నెలకు సంబంధించిన గత సంవత్సరం టారీఫ్‌ ఏప్రిల్‌ నెలకు సంబంధించిన కొత్త టారిఫ్ ప్రకారం బిల్లులు పెట్టామని వెల్లడించారు.

వినియోగదారులకు అనుకూలంగానే బిల్లింగ్ చేశామని, ఎక్కడా ఒక్క యూనిట్ కూడా అదనంగా బిల్లింగ్ చేయలేదని సీఎండీ శ్రీకాంత్ వివరించారు. కాగా, లాక్ డౌన్ నేపథ్యంలో గృహ వినియోగం పెరిగిందని, దీంతో పలు చోట్ల సమస్యలు తలెత్తినట్లు వెల్లడించారు. దీంతో సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లాకు ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. ఇక ప్రజలకు బిల్లులపై ఎమైనా అపోహాలు ఉంటే 1912కి డయల్‌ చేసి చేసి ఫిర్యాదు చేయాలని శ్రీకాంత్‌ సూచించారు.