విశాఖ లొ ‘ఓలా’ షురూ..

ఆన్‌లైన్ ట్యాక్సీ బుకింగ్ సంస్థ ఓలా, నేడు నగరంలో తమ క్యాబ్ కార్యకలాపాలను పునరుద్ధరించింది. అయితే సురక్షిత జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలలో మాత్రమే తమ సర్వీసులు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. తమ డ్రైవర్లందరూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారని, ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు కూడా వాహనంలో ఎక్కే సమయంలో, దిగే సమయంలో తప్పనిసరిగా ఓ సెల్ఫీ దిగి అప్‌లోడ్ చేయవలసి ఉంటుందని తెలిపింది. ప్రయాణికులకు పరిశుభ్రమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేర్చిన వెంటనే వాహనాన్ని పూర్తిగా శానిటైజ్ చేయడం జరుగుతుందని వివరించింది. అయితే సులభతరమైన క్యాన్సిలేషన్ విధానాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. వాహనం డ్రైవర్ మాస్కు ధరించకున్నా, తగిన నిబంధనలు పాటించకపోయినా వెంటనే క్యాన్సిల్ చేసుకునే అవకాశాన్ని వినియోగదారులకు కల్పించామని, అదే రీతిలో ప్రయాణికులు నిబంధనలు పాటించకపోతే డ్రైవర్ కూడా క్యాన్సిల్ చేసుకునే వీలుంటుందని ఓలా వెల్లడించింది. దీనికోసం  'సురక్షిత సవారీకి 10 అడుగులు' అనే విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. వీటిని తప్పనిసరిగా డ్రైవర్లు, ప్రయాణికులు పాటించాలని సూచించింది.