విశాఖ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇస్తామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వెంటిలేటర్ సాయంతో చికిత్స తీసుకునే వారికి రూ. 10 లక్షల పరిహారం అందిస్తామన్నారు. రెండు నుంచి మూడు రోజల పాటు ఆస్పత్రిలో ఉన్నవారికి లక్ష రూపాయలు పరిహారంగా చెల్లిస్తామన్నారు. స్వల్ప అస్వస్థతకు గురైన వారికి రూ. 25వేలు, ప్రభావిత గ్రామాల ప్రజలకు రూ.10 వేలు చొప్పున సాయం చేస్తామని చెప్పారు. అలాగే మృతుల కుటుంబాలకు కంపెనీ నుంచి పరిహారం వచ్చేలా చూస్తామని జగన్ వివరించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘ఎల్జీ పాలిమర్స్ ఒక అంతర్జాతీయ సంస్థ. అలాంటి సంస్థలో ఇలాంటి దుర్ఘటన జరగడం విస్మయానికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించి లోతుగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశాం. ఘటన జరిగిన తీరుపై వీరు అధ్యయనం చేసి నివేదిక ఇస్తారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సి చర్యలపై కూడా ఈ కమిటీ పూర్తి నివేదికను సమర్పిస్తుంది. ఆ రిపోర్టు ఆధారంగా ఎల్జీ పాలిమర్స్ సంస్థ విషయంలో అనుసరించాల్సిన తీరుపై నిర్ణయం తీసుకుంటాం. అవసరమైతే పరిశ్రమను తరలిస్తాం’’ అని సీఎం జగన్ వివరించారు. ఘటన జరిగిన వెంటనే సకాలంలో స్పందించి దాదాపు 340 మందికిపైగా స్థానికులను అంబులెన్సుల ద్వారా తరలించిన అధికారులను సీఎం అభినందించారు.