వేసవిలో కరోనా తగ్గుతుందా.......


ఎండాకాలంలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతుందా? తేమ తగ్గిన వేడి వాతావరణంలో వైరస్‌ ప్రభావం తగ్గుతుందా? అంటే ఒక్కో అధ్యయనంలో ఒక్కో ఫలితం వస్తోంది. స్థూలంగా ఎక్కువసార్లు వేసవికి, కరోనాకు సంబంధమే లేదని కొందరి వాదన. టొరంటో విశ్వవిద్యాలయం పరిశోధకులూ ఇదే మాట చెబుతున్నారు.


ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ చాలా దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన పీటర్‌ జుని అంటున్నారు. వేసవి, భూ ప్రదేశం, ఆర్ధ్రత, కరోనా వైరస్‌కు పొంతన కుదరడం లేదని వెల్లడించారు. ఎండలు పెరిగితే నావెల్‌ కరోనా వైరస్‌ తగ్గుతుందనడానికి ఆధారాలేమీ కనిపించలేదని పేర్కొన్నారు. భౌతికదూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, రోగనిరోధక శక్తి పెంచుకోవడమే ప్రస్తుతం మన ముందున్న మార్గాలని ఆయన స్పష్టం చేశారు.


ఉష్ణోగ్రత లేదా భూ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని మహమ్మారిపై అధ్యయనం నిర్వహించగా ఫలితాలు ఆశాజనంగా రాలేదని జుని వెల్లడించారు. బహుశా తక్కువ స్థాయిలో ఉన్న ఆర్ధ్రత ఇందుకు కారణం కావొచ్చని అంచనా వేశారు. అయితే ఈ పరిశోధనలో చైనా, దక్షిణ కొరియా, ఇరాన్‌, ఇటలీని పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తం 144 ప్రాంతాలను తీసుకోగా అందులో ఎక్కువ శాతం ఉత్తరార్ధ గోళంలోనివే ఉన్నాయి. సముద్ర మట్టానికి సమాంతరంగా ఉన్నవే ఎంపిక చేసుకున్నారు. ఇక్కడి సరాసరి ఉష్ణోగ్రత 12.8 డిగ్రీ సెంటీగ్రేడ్‌ కాగా ఆర్ధ్రత 69 శాతం.


ప్రస్తుత పరిశోధన ద్వారానైతే ఉష్ణోగ్రతల పెరుగుదల, కరోనా వైరస్‌ వృద్ధిరేటుకు సంబంధం కనిపించడం లేదు! రుతువు పాత్ర తక్కువగా ఉండటంతో వేసవిపై అతిగా ఆధారపడొద్దని జుని సూచిస్తున్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉండే భూమధ్య రేఖా ప్రాంతాలు, సమీప ప్రాంతాలను తీసుకోలేదు కాబట్టి పరిశోధనపై స్పష్టత లేదు.