ఆంధ్రాకు తప్పిన తుఫాను ముప్పు

ఆంధ్రప్రదేశ్‌కు ఎంఫాన్‌ తుపాను ముప్పు లేదని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత రెండు రోజులుగా రాష్ట్రానికి ఎంఫాన్‌ తుపాను ముప్పు పొంచి ఉందన్న వార్తలను వాతావరణ శాఖ కొట్టిపారేసింది. వాతావరణంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు కారణంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడలేదని, ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్‌కు ముప్పు తప్పిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే తుపాను హిందూ మహాసముద్రం నుంచి దూరం కావడంతో అల్పపీడనం బలహీన పడినట్లు వివరించారు. వచ్చే మూడు రోజుల్లో కూడా ఇది బలపడే అవకాశం లేదని తెలిపారు. కాగా తూర్పు మధ్య ప్రదేశ్‌ నుంచి తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ ఇంటీరియర్‌ తమిళనాడు వరకు 0.9 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు భారత వాతావరణ శాఖ విభాగం తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది.