ప్రత్యేక హెల్త్ కార్డులు ఇస్తాం: మంత్రి కన్నబాబు



ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో ప్రమాదానికి గురైన స్టైరిన్ ట్యాంక్ వద్ద మాత్రమే కొంత ప్రభావం ఉందని మంత్రి కన్నబాబు తెలిపారు. మెడికల్ నిపుణుల కమిటీని 10 మంది వైద్యులతో ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. దీనికి ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ పివి సుధాకర్ నేతృత్వం వహిస్తారని ప్రకటించారు. ఇదే విషయమై మంగళవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రభావిత గ్రామాల్లో ఎన్యూమరేషన్ ప్రారంభమైందని తెలిపారు. స్టైరిన్‌పై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని సీఎం ఆదేశించారని, అన్ని గ్రామాల్లో నెల రోజుల పాటు మెడికల్ క్యాంప్ ఉంటుందని చెప్పారు. శాశ్వతంగా వైఎస్సార్ క్లీనిక్‌ను వెంకటాపురంలో ఏర్పాటు చేస్తామని, యుద్ధ ప్రాతిపదికన దీనిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. స్టైరిన్‌ను దక్షిణ కొరియాకు తరలించే చర్యలు చేపట్టామని కన్నబాబు చెప్పారు. విశాఖలో 20 యూనిట్లు ఎల్పీజీ, కెమికల్, ఫర్టిలైజర్ కంపెనీలపై పర్యవేక్షణ మొదలు పెట్టామని వివరించారు. 





కాగా, బాధిత గ్రామాల ప్రజలు రాబోయే ఏడాది పాటు వైద్య సేవలు కోరుకుంటున్నారని, వారికి హెల్త్ కార్డ్ ఇచ్చే ప్రక్రియను కూడా చేపడుతున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. పాలిమర్ బాధితులకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో ఇప్పటికే అవకాశం కల్పించామన్నారు. అన్యాయం జరిగిందనే భావన బాధితుల్లో కొందరు కల్పిస్తున్నారని మంత్రి కన్నబాబు ఆరోపించారు. బాధితులకు ఎలాంటి అన్యాయం చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. పాలిమర్స్ బాధితులు కేజీహెచ్‌లో ఎన్ని రోజులైనా ఉండవచ్చునని, చికిత్స అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అదేవిధంగా కెమికల్ ప్రభావిత గ్రామ ప్రజలకు ప్రత్యేక హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పారు.