లాక్ డౌన్‌తో రెండు నెలలుగా డిపోలకే పరిమితమై గురువారం నుంచి ప్రయాణికులను గమ్యం చేర్చేందుకు సిద్ధమవుతున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలోని ప్రజల ప్రయాణ అవసరాలు తీర్చేందుకు పది నుంచి పదిహేను శాతం బస్సులు డిపోల నుంచి బస్టాండ్లకు చేరనున్నాయి. అప్పటికే ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న వారినీ, బస్టాండుకు వచ్చి గ్రౌండ్ బుకింగ్ ద్వారా టికెట్ తీసుకున్నవారినే బస్సుల్లోకి ఎక్కిస్తారు. నగదు ద్వారా కొవిడ్ వచ్చే అవకాశం ఉందని, అందుకే కండక్టర్ బస్సులో ఉండకుండా ఈ విధానం అమల్లోకి తీసుకొస్తున్నామని ఆపరేషన్ విభాగానికి చెందిన కీలక అధికారి ఒకరు చెప్పారు. నిజానికి, ఈ నెల 18 నుంచే బస్సులు తిప్పేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. అయితే, ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో ఇందుకు రెండు రోజులు ఆగాల్సి వచ్చింది.
బస్సుల్లో సీటింగ్ మార్పు, గ్రీన్ జోన్ల మధ్య తిప్పేందుకు ప్రణాళిక, రెడ్ జోన్లలో పాటించే నిబంధనలు, తక్కువ సీట్లతో తిప్పితే వచ్చే నష్టం, ప్రజలకు బస్సులు తిరగడం వల్ల కలిగే ఉపయోగం తదితర అంశాలపై చర్చించారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ.. హైదరాబాద్ మినహా రాష్ట్రమంతా తిప్పేందుకు నిర్ణయం తీసుకొంది. అదే తరహాలో మన రాష్ట్రంలోనూ పెద్దనగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో మరికొన్ని రోజులు బస్సులు నడపరాదని నిర్ణయించారు. చార్జీల విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి పెంపు లేకుండా పాత రేట్లతోనే నడపాలని సీఎం చెప్పడంతో అధికారులు సరేనన్నారు. అయితే డిపోల్లో కొన్ని బస్సులకే సీటింగ్ విధానం మార్చడం వల్ల వీలైనంత మేరకు బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. స్పందన ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. కాగా, ఆర్టీసీ బస్సులు తిప్పడంపై బుధవారం ఎంపీ మాదిరెడ్డి ప్రతాప్ అధికారికంగా ప్రకటన చేయనున్నారు.