కరోనాను కట్టడి చేసే క్రతువులో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇటీవల మూడోసారి లాక్‌డౌన్‌ను మే 17వ తేదీ వరకూ పొడింగించారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరిట రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. అయితే, ఈ సందర్భంగా ప్రజలందరూ ప్రధాని మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా వీక్షించారు. లాక్‌డౌన్‌పై ఆయన ఏం చెబుతారని ఉత్కంఠతో ఎదురు చూశారు. 17వ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం వెలువరిస్తారోనని ఆసక్తిగా ఎదురు చూశారు. అందరూ భావించినట్లుగానే లాక్‌డౌన్ 4.0గా మోదీ సూచనప్రాయంగా చెప్పారు.
ప్రధాని మోదీ తన ప్రసంగంలో లాక్‌డౌన్ 4.0 గురించి సూచనప్రాయంగా మాట్లాడారు. మాస్కులు కట్టుకుందాం, రెండడుగుల దూరం పాటిద్దాం అని పిలుపునిచ్చిన ప్రధాని.. లాక్‌డౌన్ 4.0 పూర్తిస్థాయిలో భిన్నంగా ఉంటుందన్నారు. రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనల మేరకు లాక్‌డౌన్ 4.0కు సంబంధించిన సమాచారం మే 18 కంటే ముందే అందరికీ తెలియజేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ 4.0 ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది. ప్రధాని మోదీ వెల్లడించే నిబంధనలు ఎలా ఉంటాయి? ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు? వేటికి అనుమతులు ఇస్తారు? తదితర విషయాలపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
నాలుగో దశ లాక్‌డౌన్‌కు కావాల్సిన కొత్త రూపురేఖలు రూపొందించనున్నట్లు ప్రధాని చెప్పారు. ఇప్పటికే కొంత మేర లాక్‌డౌన్ నిబంధనల సడలింపుతో పలు పరిశ్రమలు, ప్రైవేటు రంగ సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించాయి. ప్రధాని మోదీ ప్రసంగించిన మేరకు నాలుగో దశ లాక్‌డౌన్‌లో దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే విధంగా భారీ స్థాయిలో సడలింపులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రాల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకొని లాక్‌డౌన్-4కు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తామని మోదీ చెప్పారు. కరోనా కారణంగా ఇప్పటికే చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని రకాల పరిశ్రమలు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రకటించిన ప్యాకేజీతో ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూది నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా లాక్‌డౌన్ 4.0 విధిస్తూనే కొన్నింటికి మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది.