తిరుమల శ్రీవారి దర్శనం మరింత కష్టతరం కానుందా? ఇకపై ఎప్పుడుపడితే అప్పుడు తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకోవడం కుదరదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు టీటీడీ సరికొత్త చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. తిరుమలలో రోజుకు 60 వేల నుంచి 80 వేల మంది వరకు భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. వారాంతాల్లో, సెలవు రోజుల్లో, ప్రత్యేక దినాల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుంది.
అయితే రానున్న రోజుల్లో కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోయేవరకు భక్తుల సంఖ్యపై పరిమితి విధించే అవకాశం ఉంది. విశ్వాసనీయ వర్గాల సమాచారం ప్రకారం సాధారణ పరిస్థితుల్లో రోజువారి వచ్చే భక్తుల్లో నాలుగోవంతుమంది భక్తులకు మాత్రమే ధర్శనానికి అనుమతి ఇస్తారు. అందులోనూ కేవలం ఆన్‌లైన్, టైమ్ స్లాటెడ్ భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా అనుమతించే సర్వ దర్శనాన్ని కొంతకాలం పాటు నిలిపివేయాలనే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది.