‘ఎల్జీ పాలిమర్స్‌కు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు’



విశాఖ ఘటనకు సంబంధించిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు అండ్ కో కావాలనే వైజాగ్ బ్రాండ్ ఇమేజ్ డామేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. టిట్వర్ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ప్రభుత్వానికి బాధ్యత లేదని విమర్శలు చేయడం సబబు కాదు. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు చెల్లిస్తున్నాం. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చేస్తున్నాం. గ్రామస్తులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఈ ఘటన పై అధికార యంత్రాంగం మంత్రులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేసిన పోలీసులకు సెల్యూట్ చేయాలి. సరైన సమయానికి స్పందించడంతో  పెను ప్రమాదం తప్పింది అని మంత్రి అవంతి తెలిపారు.


ఎవరూ భయపడనక్కర్లేదు..


‘ వైసీపీ ప్రభుత్వం పరిపాలనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. పని కట్టుకొని మరీ చనిపోయిన వారి మృత దేహాలను ఫ్యాక్టరీ దగ్గరకు తీసుకొచ్చి గొడవ చేయించారు. రెచ్చ గొట్టే చర్యలు మానుకోవాలి. ప్రజల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు. రేపు సాయంత్రానికి పరిస్థితి చక్కబడుతుంది. ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోవచ్చు. కారకులపై విచారణ కమిటీ వేయించాం. తప్పకుండా చర్యలు తీసుకుంటాం’ అని బాధిత గ్రామాల ప్రజలకు మంత్రి అవంతి భరోసా ఇచ్చారు.