2020 వరకు కరోనా ముప్పు


మిన్నెసొటా వర్సిటీ నిపుణుల నివేదిక


సంక్షోభం మరో రెండేళ్లపాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయని మిన్నెసొటా యూనివర్సిటీలోని సెంటర్‌ ఫర్‌ ఇన్ఫెక్షస్‌ డిసీజ్‌ రిసెర్చ్‌ అండ్‌ పాలసీ (సీఐడీఆర్‌ఏపీ) నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మంది ఆ వైర్‌సను తట్టుకొనే శక్తిని సంతరించుకునేవరకూ ఈ ముప్పును నియంత్రించలేమని పేర్కొంటూ వారు ఒక నివేదికను విడుదల చేశారు. ఆ నివేదిక ప్రకారం.. కరోనా వైరస్‌ సోకినా ఎలాంటి లక్షణాలూ బయటకు కనపడకుండా ఉన్నవారే ఇందుకు కారణం. ‘‘కొందరికి లోలోపల ఇన్ఫెక్షన్‌ ముదిరిపోతున్నా.. ఆ లక్షణాలు త్వరగా బయటపడని ప్రత్యేక పరిస్థితి కారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తిని అంత సులువుగా అడ్డుకోలేమ’’ని వారు అభిప్రాయపడ్డారు.


ఇన్‌ఫ్లూయెంజాను అదుపులోకి తెచ్చినంత సులువుగా కరోనాను నిలువరించలేమని స్పష్టంచేశారు. సుదీర్ఘ లాక్‌డౌన్ల తర్వాత ప్రపంచ దేశాలు ఒక్కటొక్కటిగా నిబంధనలను సడలిస్తున్నాయని.. జనసంచారం మొదలైన తర్వాత మళ్లీ కరోనా ముసురుకోవడం తథ్యమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో 2022 సంవత్సరం లేదా అంతకుమించి కూడా కొవిడ్‌-19 వ్యాప్తి కొనసాగవచ్చని అంచనావేశారు. ఈ విపత్తు ఇంకా ముగియలేదని ప్రపంచదేశాలు గ్రహించాలని.. భారీగా ఇన్ఫెక్షన్ల సంక్రమణ రూపంలో ఎదురవబోయే ముప్పును ఎదుర్కొనేందుకు సర్వ సన్నద్ధం కావాలని సూచించారు.


అందరి ఆశలు కరోనా వ్యాక్సిన్‌పైనే ఉన్నప్పటికీ.. ఈ ఏడాది చివరికల్లా చాలా తక్కువ డోసులే అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. కాగా.. కరోనాను నియంత్రించి, ప్రపంచం మొత్తాన్నీ మళ్లీ 2019 డిసెంబరు ముందు నాటి పరిస్థితికి తీసుకెళ్లగలిగే టీకా తయారీకి కనీసం 9 నెలల నుంచి రెండేళ్ల సమయం పడుతుందని మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌  వ్యాఖ్యానించారు. ఒకవేళ టీకా తయారై.. ప్రపంచం మొత్తానికీ సరిపోవాలంటే సింగిల్‌ డోస్‌ టీకా అయితే 700 కోట్ల డోసులు, అంత కన్నా ఎక్కువ డోసులు ఇవ్వాల్సి వస్తే 1400 కోట్ల డోసులు తయారుచేయాల్సి ఉంటుందని బిల్‌గేట్స్‌ అభిప్రాయపడ్డారు.