కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదాపడ్డ 10వ తరగతి పరీక్షల్ని నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. లాక్‌డౌన్ ముగిసిన రెండు వారాల తర్వాత ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ ఉంటాయని ఇప్పటికే విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ మే 17న ముగియనుంది. లాక్‌డౌన్ ఎత్తేస్తే రెండు వారాల తర్వాత పదవ తరగతి పరీక్షలు ఉంటాయి. టెన్త్ ఎగ్జామ్స్‌కు సంబంధించిన షెడ్యూల్ కూడా లాక్‌డౌన్ ఎత్తేసిన తర్వాతే విడుదలవుతుంది. ఈ పరీక్షల్ని ఎలా నిర్వహించాలన్నదానిపై కసరత్తు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. పరీక్షల నిర్వహణతో పాటు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం కూడా ముఖ్యమే. అందుకే అధికారులు ఆ దిశగా ప్రణాళికలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించబోయే పదవతరగతి పరీక్షలో కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు మార్గదర్శకాలను పాటించబోతోంది. ఒక పరీక్ష హాలులో కేవలం 12 మంది విద్యార్థులు మాత్రమే పరీక్ష రాసేలా చర్యలు తీసుకుంటోంది. సాధారణంగా 30 నుంచి 40 మంది విద్యార్థులు ఒకే హాల్‌లో పరీక్షలు రాస్తుంటారు. కానీ సామాజిక దూరం పాటించాలి కాబట్టి హాలులో విద్యార్థుల సంఖ్యను తగ్గించబోతున్నారు. అంతేకాదు విద్యార్థుల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేస్తారు. హాలులో తక్కువ మంది విద్యార్థులకు సీట్లు కేటాయించడం వల్ల ఎగ్జామ్ సెంటర్లు పెరగనున్నాయి.