కరోనా వైరస్ ఏపీలో పంజా విసురుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది.. ముఖ్యంగా కర్నూలు, గుంటూరు జిల్లాల్లో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. జనాలను రోడ్లపైకి రావొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లోనే ఉండండి బయటకు రావొద్దు బాబోయ్ అంటూ.. పోలీసులు మొత్తుకుని చెబుతున్నా కొంతమంది మాట వినడం లేదు. చిన్న, చిన్న కారణాలతోనే కొందరు రోడ్లపైకి వాహనాలతో వస్తున్నారు. పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో.. రెడ్ జోన్‌లు ప్రకటించిన ప్రాంతాల్లో కూడా దర్జాగా రోడ్లపై తిరిగేస్తున్నారు. ముందు పోలీసులు లాఠీలకు పని చెప్పారు.. జరిమానాలు విధించారు. పోలీసులు వేసిన ఫైన్ కట్టేసి మళ్లీ షరా మామూలే. ఇంత చేసినా జనాల్లో మార్పు రాకపోవడం.. పోలీసులపై కూడా విమర్శలు రావడంతో విసిగిపోయారు. దీంతో వినూత్నమైన మార్గాన్ని ఎంచుకున్నారు.. వెరైటీ శిక్షలతో వాహనదారులకు షాకిస్తున్నారు. రోజుకో విధంగా పనిష్మెంట్ ఇస్తున్నారు. తాజాగా గుంటూరు పోలీసులు లాక్‌డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న వాహనదారులకు వినూత్నమైన శిక్ష విధించారు.
లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారికి సెల్ఫీ పనిష్మెంట్ ఇస్తున్నారు పోలీసులు. 'నేను మూర్ఖుడిని.. నేను సమాజానికి శత్రువుని.. నేను మాస్క్ పెట్టుకొను. పని పాట లేకుండా రోడ్ల మీద తిరిగి కరోనా వైరస్ వ్యాప్తి చేస్తాను. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాను' అంటూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారు ఆ సెల్ఫీ పాయింట్ దగ్గరకు వచ్చి మొబైల్‌లో సెల్ఫీ తీసుకోవాలి. లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారిని ఫ్లెక్సీ దగ్గరకు పిలిచి సెల్ఫీ తీయిస్తున్నారు పోలీసులు. తర్వాత ఆ ఫోటోను వారి ఫోన్‌లో వాట్సాప్ డీపీగా పెట్టిస్తున్నారట.. సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేయిస్తున్నారట. వాహనదారులు కూడా సిగ్గు పడుతూ వచ్చి సెల్ఫీలు దిగుతున్నారు.