ఖననానికి నా కాలేజ్‌ వాడుకోండి


ప్రముఖ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌పై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. కరోనా వైరస్‌ బారినపడి మృతి చెందిన వారి ఖననానికి స్థలం ఇస్తానని చెప్పిన ఆయన మంచి మనసును మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారు. చెన్నైకి చెందిన ఓ వైద్యుడికి కరోనా వైరస్‌ సోకింది. పరిస్థితి విషమించి ఆదివారం ఆయన మృతి చెందాడు. వైద్యుడి మృతదేహాన్ని ఖననం చేయడానికి వెళ్లగా.. స్థానికులు వ్యతిరేకత తెలిపారు. దీంతో విజయ్‌కాంత్‌ స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. కరోనాతో మృతిచెందిన వారిని ఖననం చేయడానికి తన సొంత స్థలం ఇస్తానన్నారు. తన ఆండాళ్‌ అళగర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలోని కొంత భాగాన్ని ఖననానికి ఇస్తానని పేర్కొన్నారు. కరోనాతో మృతి చెందినవారిని ఖననం చేయటంతో వైరస్‌ వ్యాపించెందదని ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా సోమవారం ఆయన కోరారు.


విజయ్‌కాంత్‌ ఉదారత తెలుసుకున్న పవన్‌ మంగళవారం సాయంత్రం ట్వీట్‌ చేశారు. ‘కరోనా వైరస్‌తో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని శ్మశానవాటికలో ఖననం చేయడానికి స్థానికులు నిరాకరించారు. కానీ, డీఎండీకే నాయకుడు, సూపర్‌స్టార్ విజయ్‌కాంత్‌ తన కళాశాల భూమిలో కొంత భాగాన్ని కరోనా బాధితుల కోసం ఇవ్వడం నిజంగా అద్భుతమైన విషయం. ఆయనది ఎంతో గొప్ప వ్యక్తిత్వం’ అని పేర్కొన్నారు.