లాక్‌డౌన్ సడలింపుల్లో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో కేంద్రమంత్రి అమిత్ షా సూచనల మేరకు ప్రభుత్వం తాజాగా మరోసారి అదనపు మార్గదర్శకాలు విడుదల చేసింది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా ఆర్థిక రంగానికి మినహాయింపు లభించింది. లాక్‌డౌన్ ప్రాంతాల్లో నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. పవర్ లైన్స్, టెలికాం కేబుల్స్ పనులకు మినహాయింపు లభించింది. వ్యవసాయ రంగం, ఉద్యాన పనులు, ప్లాంటేషన్ పనులు, కోత, ప్రాసెసింగ్, ప్యాకింగ్, మార్కెటింగ్ రంగాలకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ పనులు చేసుకునేందుకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. వలస కార్మికులకు రాష్ట్ర పరిధిలోని సొంత ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకునేందుకు వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం.. కేవలం కరోనా లక్షణాలు లేనివారు మాత్రమే పనులు చేయాలని స్పష్టం చేసింది. వలస కార్మికులు ఏ రాష్ట్రంలో ఉంటే అక్కడే పనులు చేసేలా అనుమతులు మంజూరు చేసింది. ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, పుస్తక విక్రయ దుకాణాలకు మినహాయింపు లభించింది. ఓడలకు ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాల్స్ తప్ప గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాలు, మార్కెట్ కాంప్లెక్స్‌లకు అనుమతి లభించింది. కావాల్సిన అనుమతులతో ఈ-కామర్స్ కంపెనీలకు, వారు వాడే కార్లకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.