మెగాస్టార్ మా సంసారంలో నిప్పులు పోయకండి...


మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ ఎంపీ పీవీపీ ( పొట్లూరి వీర ప్రసాద్) ఆసక్తికర ట్వీట్ చేశారు. బి ది రియల్ మ్యాన్ ఛాలెంజ్‌లో భాగంగా చిరు ఇంటి పనులు చేస్తూ పెసరట్టు వేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియో చూసిన పీవీపీ చిరుపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘చిరంజీవి గారు,ఏదో ఇంట్లో అంట్లు తోమగలము,గచ్చు కడగగలము కానీ మీరిలా స్టార్ చెఫ్ లా నలభీమ పాకము వండుతుంటే, మా ఆవిడ మెగాస్టారే చేయగలేనిది, మీకేమిటి అంటున్నారు..మా సంసారంలో నిప్పులు పోయొద్దు రియల్ లైఫ్ మెగాస్టార్ గారు’ అంటూ పీవీపీ ట్వీట్ ద్వారా తెలిపారు. ఆ తర్వాత జస్ట్ జోక్ చేశానని... మీరు ఎందరికో ఆదర్శం, మిమ్మల్ని ఎందరో అభినందిస్తారు అంటూ ఆయన తెలిపారు. తన ట్వీట్ కు చిరు వీడియోను కూడా ట్యాగ్ చేస్తూ పోస్టు చేశారు.


ఎన్టీఆర్ విసిరిన సవాల్‌ను స్వీకరించిన చిరంజీవి ఇవాళ ఉదయం ఆ ఛాలెంజ్ పూర్తి చేశారు. ఇంటి పనులు చేసి దానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వాక్యూమ్ క్లీనర్‌తొ ఇళ్లంతా క్లీన్ చేశారు మెగాస్టార్. ఆ తర్వాత కిచెన్‌లోకి వెళ్లి స్వయంగా టిఫిన్ తయారు చేశారు. పొయ్యిపై పెనం పెట్టి గుండ్రంగా పెసరట్టు వేశారు. ఆ తర్వాత అట్టును తీసుకెళ్లి తన తల్లి అంజనా దేవికి అందించారు.


అయితే కొడుకు తీసుకొచ్చిన టిఫిన్‌ను చూసి మురిసిపోయిన తల్లి... మొదటి ముద్ద కొడుకుకే తినిపంచారు. అనంతరం ఆమె కూడా తిన్నారు. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని తల్లితో ముచ్చట్లు చెబుతూ నవ్వుతూ ఉన్న వీడియోను మెగాస్టార్ చిరంజీవి పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన అభిమానులంతా పండగ చేసుకుంటున్నారు. ఇక తన టాస్క్ పూర్తి చేసిన చిరు తన తరపున మణిశర్మ, రజనీకాంత్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు.