ఏటీఎం కార్డు ఉన్న వారికి శుభవార్త!

దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా తన కస్టమర్లకు తీపికబురు అందించింది. కరోనా వైరస్ లాక్ డౌన్ పరిస్థితుల్లో ఖాతాదారులపై అదనపు భారం పడకుండా ఉండేందుకు ఏటీఎం సర్వీస్ చార్జీలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఉచిత ఏటీఎం లావాదేవీల పరిమితి దాటిన తర్వాత నిర్వహించే ఏటీఎం ట్రాన్సాక్షన్లపై ఎలాంటి చార్జీలు పడవని స్టేట్ బ్యాంక్ పేర్కొంది.

స్టేట్ బ్యాంక్ తాజా ఏటీఎం సర్వీస్ చార్జీల ఎత్తివేత నిర్ణయం జూన్ 30 వరకు అమలులో ఉంటుందని బ్యాంక్ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బీఐ తెలిసింది. ఎస్‌బీఐ ఏటీఎం లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలు అన్నింటికీ తాజా సర్వీస్ చార్జీల తొలగింపు నిర్ణయం వర్తిస్తుందని బ్యాంక్ స్పష్టతనిచ్చింది.