స్త్రీలకంటే పురుషులకే ఎక్కవగా కరోనా..

కరోనా వైరస్‌ బారిన పడుతున్నవారిలో, మరణాల్లో పురుషులదే అగ్రస్థానం. ఆ స్థాయిలో మహిళలు ఈ వైరస్‌ బారిన పడకుండా కాపాడుతున్నది ఏమిటి? అనే ప్రశ్న చికిత్సలో కొత్త ప్రయోగాలకు దారిచూపుతోంది. సాధారణంగా స్త్రీలలోని ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌ హార్మోన్లు వారి పాలిట రక్షణ కవచంలా ఉంటున్నాయా? అనేది పరిశోధకుల్ని ఆలోచింపజేస్తోంది. ఊహాగానాలు ఎందుకు.. పరీక్షిద్దాం అంటూ స్వల్పకాలిక పరీక్షలకూ సిద్ధమయ్యారు వైద్యులు. ఇందులో భాగంగా గత వారం న్యూయార్క్‌లోని లాంగ్‌ఐలాండ్‌లో వైరస్‌ సోకిన పురుషులకు రోగనిరోధక శక్తి పెంచే లక్ష్యంతో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఇవ్వడం ప్రారంభించారు. వచ్చే వారం.. లాస్‌ఏంజెలెస్‌లో కొందరికి ప్రొజెస్టిరాన్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రెండింటినీ స్త్రీల హార్మోన్లుగా భావిస్తారనే విషయం తెలిసిందే. అయితే ఈ ప్రయోగాలతో ప్రయోజనం ఉండబోదని మరికొందరు పరిశోధకులు చెబుతున్నారు. ఈ హార్మోన్లు విడుదలకాని మెనోపాజ్‌ దశకు చేరిన మహిళలు కూడా.. అదే వయసు పురుషులతో పోలిస్తే తక్కువగానే కొవిడ్‌-19 బారిన పడుతున్నారని ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.