ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ పుట్టుకకు కారణం జంతువులేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకటించింది. ప్రస్తుతం తమ వద్ద ఉన్న ఆధారాల ప్రకారం కరోనా చైనాలో జంతువుల నుంచి సంక్రమించిందని వెల్లడించింది. కొవిడ్-19 వైరస్ లేబొరెటరీలో సృష్టించింది కాదని స్పష్టం చేసింది. ‘‘మా వద్ద ఉన్న పలు ఆధారాలు కరోనా వైరస్ జంతువుల మూలాలను కలిగి ఉందని సూచిస్తున్నాయి. దీన్ని లేబొరెటరీలోనో, మరే ఇతర ప్రదేశాల్లో తయారుచేయలేదు. ఈ వైరస్ పుట్టుకకు కారణం జంతువులేనని చెప్పాలి. అయితే ఇది ఎలా మానవులకు సంక్రమించిందనే దానిపై స్పష్టత లేదు. ఈ వైరస్ వ్యాప్తికి ఏదో ఒక జంతువు వాహకంగా వ్యవహరించి ఉంటుంది. దీని మూలాలు ఎక్కువగా గబ్బిలాల్లో ఉన్నాయి. వాటి నుంచి అది మనుషులకు ఎలా వ్యాపించిదనే విషయాన్ని కనుక్కోవాలి’’ అని డబ్ల్యూహెచ్‌వో అధికార ప్రతినిధి ఫడెలా చైబ్ తెలిపారు. వైరస్ ఏదైనా లేబొరేటరీ నుంచి అనుకోకుండా బయటికి వచ్చిందా? అనే దానిపై స్పందించేందుకు మాత్రం ఆమె నిరాకరించారు.
కరోనా వైరస్ చైనాలోని వుహాన్‌లో ఉన్న పీ4 లేబొరెటరీ నుంచి పుట్టుకొచ్చిందా లేదా అనే విషయాన్ని కనుగొనేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. కరోనా నియంత్రణలో విఫలమైందన్న కారణంతో డబ్ల్యూహెచ్‌వోకు తమ వంతు నిధులను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ చేసిన ప్రకటనపై సమీక్షిస్తున్నామన్న ఫడెలా.. ట్రంప్ నిర్ణయానికి అనుగుణంగా పరిస్థితులను అంచనావేసి, మిగిలిన భాగస్వాములతో కలిసి ఆర్థిక లోటును భర్తీ చేస్తామని అన్నారు. ‘ డబ్ల్యూహెచ్‌వో తన కార్యకలాపాలను ‘కొనసాగించడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఇది కేవలం కరోనా నియంత్రణకు చేస్తున్నది కాదు, ఎన్నో ఇతర ఆరోగ్య కార్యక్రమాలు చేపడుతోంది’’ అని ఫడెలా అన్నారు.