వైఎస్‌ఆర్ జయంతిని పురస్కరించుకుని జులై 8వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. 27 లక్షల మంది మహిళలకు ఆ రోజు ఇళ్లపట్టాలను ఇస్తామని ఆయన చెప్పారు.
'వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ' పథకాన్ని క్యాంపుకార్యాలయంలో శుక్రవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఆన్‌లైన్ ద్వారా బటన్ నొక్కి నగదు బదిలీ చేశారు. ' బటన్ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సిఎఫ్‌ఎంఎస్ ద్వారా ఒకేసారి 1400 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. ' అని సిఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం పలు జిల్లాల పొదుపు సంఘాల మహిళలు, కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మహిళలకు ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని ప్రారంభించి నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆరు జిల్లాల్లో బ్యాంకులు 7శాతం వడ్డీకి ఇస్తుంటే, ఏడు జిల్లాల్లో 11 నుండి 13శాతం వరకూ వడ్డీ తీసుకుంటున్నాయని చెప్పారు. బ్యాంకులు వడ్డీ భారం వేస్తున్నాయని పేర్కొన్నారు. ఆ వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు.సగటున ప్రతి గ్రూపునకు రూ.20 వేల నుండి రూ.40 వేల వరకూ వస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది నుండి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫీజు రీయింబర్స్‌మెంట్ నేరుగా తల్లుల ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ జయంతి రోజున ఇచ్చే ఇళ్ల పట్టాలతో పాటు ఉచితంగా ఇళ్లు కూడా కట్టించి ఇస్తామని చెప్పారు. మహిళల చేతిలో డబ్డు పడితేనే సద్వినియోగం అవుతుందన్న ఆలోచనతోనే ఈ పనులన్నీ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 82 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా అమ్మఒడి పథకాన్ని ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. మహిళలపై దాడులను, వేధింపులను అడ్డుకునే లక్ష్యంతో దిశ చట్టం తీసుకువచ్చినట్టు చెప్పారు. రాష్ట్రంలో 13 దిశ పోలీస్ స్టేషన్లు, జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు తీసుకురావాలని ప్రతిపాదించామని, దీనికి త్వరలోనే రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసులను నియమించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్స సత్యనారాయణ, సిఎస్ నీలం సహానీ తదితరులు పాల్గొన్నారు.
జులై 8న ఇళ్ల పట్టాల పంపిణీ