కరోనా వైరస్ కట్టడి చేశామని సంబరపడిపోవద్దని, సామాజిక దూరం తప్పక పాటించండంటూ వైద్య నిపుణులు సూచిస్తుంటే, చైనాలో మాత్రం ముద్దుల పోటీ పెట్టారు. ఇవేం చేష్టలు బాబోయ్ అంటే ఉద్యోగుల్లో ఒత్తిడి పోగొట్టడమే మా లక్ష్యం అంటోంది సదరు కంపెనీ. ఇంతకీ ఆ వివరాలేంటంటే..
కరోనా వైరస్ పుట్టిల్లుగా భావిస్తోన్న చైనాలో దాదాపుగా ఆంక్షలన్నింటినీ ఒక్కొక్కటిగా తొలగిస్తుంది అక్కడి ప్రభుత్వం. దాంతో అక్కడ కంపెనీలు తెరుచుకుంటున్నాయి. తన సంస్థ పునఃప్రారంభాన్ని పురస్కరించుకొని ఆ దేశంలోని ఓ ఫర్నిచర్ సంస్థ ముద్దుల పోటీ పెట్టింది. ఇన్నాళ్లు కరోనా కారణంగా తమ ఉద్యోగులు ఒత్తిడి ఎదుర్కొన్నారని, దాని నుంచి బయటపడి విధుల్లో నిమగ్నం కావడానికి ముద్దుల పోటీ పెట్టామని షుజౌ ప్రాంతంలో సదరు ఫర్నిచర్ సంస్థ వెల్లడించింది. పది జంటలు ఈ పోటీలో పాల్గొన్నాయని, వారిలో కొందరు భార్యభర్తలు కూడా ఉన్నారని తెలిపింది. అలాగే వైరస్ ప్రభావం ఉండకూడదని ప్రతి జంటకు మధ్య ఒక గ్లాస్‌ను ఏర్పాటు చేసింది. వారు దానికి ఇరువైపులా ఉండి ఆ పోటీలో పాల్గొన్నారు. దానికి సంబంధించిన ఫొటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొట్టాయి.
దీనిపై ఆ ఫర్నీచర్ సంస్థ యజమాని మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ మహమ్మారి కారణంగా అందరూ ఒత్తిడిలో కూరుకుపోయారు. అది పనిలో తప్పులు చేయడానికి కారణం కావొచ్చు. అందరిని సంతోషంగా ఉంచడం కోసమే ఈ ముద్దుల పోటీని ఏర్పాటు చేశాను. ఈ పోటీలో కొన్ని జంటలు పాల్గొన్నాయి. వారిలో భార్యభర్తలు కూడా ఉన్నారు. అలాగే వైరస్ ప్రభావం ఉండకూడదని వారి మధ్య ప్లెక్సీగ్లాస్‌ను ఏర్పాటు చేశాను. దాన్ని ఆల్కహాల్‌తో చాలాసార్లు శుభ్రం చేయించాను’ అని ఆయన తెలిపారు. అయితే ఆయన వినూత్న ఆలోచన సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల చేతికి పనిచెప్పింది. ఎక్కడా సామాజిక దూరమే కనిపించడం లేదని వారు మండిపడ్డారు.