ఎంపీల వేతనాల్లో 30 శాతం కోత

కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా ఎంపీల వేతనాలు, పింఛన్లలో 30 శాతం కోతకు సంబంధించిన ఆర్డినెన్స్‌కు కేబినెట్‌లో ఆమోదం తెలిపిందని ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. ప్రధాని, కేంద్రమంత్రులతో పాటు ఎంపీలందరి వేతనాల్లో ఏడాది పాటు కోత ఉంటుందని తెలిపారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా పలువురు గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు స్వచ్ఛందంగా వేతనాల కోతకు ముందుకొచ్చారని వివరించారు. ఈ మొత్తం సంఘటిత నిధికి వెళుతుందని తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఈ కోత వర్తిస్తుందని పేర్కొన్నారు.



అలాగే, కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఎంపీ ల్యాడ్స్‌ నిధులను కూడా తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జావడేకర్‌ తెలిపారు. రెండేళ్ల పాటు అమల్లో ఉంటుందని తెలిపారు. ఈ మొత్తం కూడా సంఘటిత నిధికి వెళుతుందన్నారు. లాక్‌డౌన్‌ గురించి మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రజలు, దేశం ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వివరించారు.