ఇక రోజూ 25 వేల మందికి పరీక్షలు


కరోనా మహమ్మారి నివారణ చర్యల్లో ఆంధ్రప్రదేశ్ మరో ముందడుగు వేసినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు థర్మల్‌ స్క్రీనింగ్‌ కిట్లను కూడా ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. తద్వారా కరోనా నిర్ధారణ పరీక్షల్లో మరో ముందడుగు వేశామన్నారు. విశాఖపట్నంలోని మెడ్‌టెక్‌ జోన్‌లో వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. రోజుకు 25 వేల మందికి పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి సరిపడా కిట్లు సిద్ధం చేస్తున్నామని ప్రకటించారు.


బుధవారం నుంచే థర్మల్‌ స్కానర్లను ప్రారంభిస్తున్నట్లు మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తిని నియంత్రించగలిగామన్న మేకపాటి గౌతమ్‌రెడ్డి.. మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ఏపీలోనే కరోనా స్క్రీనింగ్‌ బాగా జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెరుగుతున్న కేసులన్నీ క్వారంటైన్‌లో ఉన్నవారికి సంబంధించినవేనని తెలిపారు.

అలాగే రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలు గురించి మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్‌జోన్‌లో ఉన్న పరిశ్రమలను తెరవబోమని స్పష్టం చేశారు. కేవలం గ్రీన్ జోన్‌లో ఉన్న పరిశ్రమలకే అనుమతులిస్తున్నామని, ఇప్పటి వరకు 160 పరిశ్రమలకు అనుమతులిచ్చినట్లు చెప్పారు. కార్మికుల రక్షణకు జాగ్రత్తలు తీసుకున్నవారికే అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)ను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మేకపాటి హామీ ఇచ్చారు. కాగా, ఇటీవలే మెడ్ టెక్ జోన్ నుంచి కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు తయారు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, థర్మల్ స్క్రీనింగ్ కిట్లను కూడా ఉత్పత్తి చేస్తున్నారు.