వాట్ యాన్ ఐడియా జీ


కరోనా భయం ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది. ఏపీలో కూడా 11 కేసులు నమోదయ్యాయి.. ఈ కేసుల్లో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కూడా ఒకటి ఉంది. పట్టణానికి చెందిన యువకుడు లండన్‌ నుంచి ఈనెల 19న చెన్నై వచ్చాడు. అక్కడి నుంచి కారులో శ్రీకాళహస్తి చేరుకున్నాడు. అప్పటినుంచి ప్రభుత్వ ఆదేశాలతో హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నాడు. 20న దగ్గు, జలుబుకు గురికావడంతో 23న రుయా ఆసుపత్రిలోని కరోనా ఐసొలేషన్‌ వార్డుకు వచ్చి శాంపిల్స్‌ ఇచ్చాడు. వైరాలజీ సెంట్రల్‌ ల్యాబ్‌లో పరీక్షించగా.. కరోనా సోకినట్టు నిర్ధారించారు. ప్రత్యేక ఐసొలేషన్‌ వార్డులో అడ్మిట్‌ చేసుకుని వైద్యసేవలు అందిస్తున్నారు.


శ్రీకాళహస్తిలో యువకుడికి కరోనా పాజిటివ్ నమోదు కావడంతో.. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, అధికారులు అప్రమత్తం అయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పట్టణంలో హై క్లోరైడ్ మిశ్రమాన్ని డ్రోన్ ద్వారా ("డ్రోన్ శానిటైజర్") చల్లించారు. అత్యవసర పరిస్థితులు అయితే తప్ప ప్రజలు ఎవరు ఇంటి నుండి బయటకు రావొద్దని కోరుతున్నారు. ఈ పనుల్ని ఎమ్మెల్యేనే దగ్గరుండి పర్యవేక్షించారు. టెక్నాలజీ సాయంతో ఎమ్మెల్యే డ్రోన్ ద్వారా శానిటైజేషన్ చేపట్టారు.