న్యూఢిల్లీ: ఎస్ బ్యాంకు కుంభకోణానికి సంబంధించి సీబీఐ దాడులు ముమ్మరం చేసింది. ముంబైలోని ఏడు ప్రాంతాల్లో సోమవారంనాడు సోదాలు జరిపింది. ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణాకపూర్ నివాసాలు, అధికార కార్యాలయాల్లో సీబీఐ ఈ దాడులు నిర్వహించింది.
డీహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ కపిల్ వాద్వాన్‌తో కలిసి రాణాకపూర్ నేరపూరిత కుట్రకు పాల్పడ్డాడని సీబీఐ అభియోగం. డిహెచ్ఎఫ్ఎల్‌కు రాణాకపూర్ ఎస్ బ్యాంకు ద్వారా ఆర్థిక సాయం చేశాడని, అందుకు ప్రతిగా రాణాకపూర్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలకు డీహెచ్ఎల్ఎఫ్ నుంచి అనుచిత లబ్ధి చేకూరిందని సీబీఐ ఆరోపిస్తోంది. డీహెచ్ఎఫ్ఎల్‌కు స్వల్ప కాలిక డిబెంచర్ల ద్వారా ఎస్ బ్యాంకు రూ.3.700 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని, 2018 ఏప్రిల్, జూన్ మధ్య ఈ కుంభకోణం రుపుదిద్దుకుందని ఎఫ్ఐఆర్‌లో సీబీఐ పేర్కొంది. ఇందుకు ప్రతిగా, వాద్వాన్ రూ.600 కోట్లు ముడుపులు కపూర్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీ అర్బన్ వెంచర్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు (డీఓఐటీ) రుణం రూపంలో చెల్లించిందని సీబీఐ చెబుతోంది.
మోసం, అవినీతి కేసులో రాణాపై ఈనెల 8న సీబీఐ కేసు నమోదుచేసింది.
కాగా, ముంబై నుంచి లండన్‌కు వెళ్లేందుకు బయలుదేరిన రాణా కుమార్తె రోషిని కపూర్‌ను విమానాశ్రయం వద్ద అధికారులు అడ్డుకోవడం తాజా పరిణామం. రోషిని డీఓఐటీ డైరెక్టర్‌గా ఉన్నారు. కపూర్, ఆయన కుటుంబ సభ్యులపై లుకౌట్ నోటీసుల నేపథ్యంలో ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను లండన్ విమానం ఎక్కడానికి సిద్ధమవుతుండగా అడ్డుకున్నారు.