ఆ మూడు నగరాలపై ప్రత్యేక దృష్టి


ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వస్తామంటూ సరిహద్దులకు వస్తున్న వారి విషయంలో ఏపీ ప్రభుత్వం కాస్త కఠినంగానే వ్యవహరించాలని నిర్ణయించింది. 14 రోజులు క్వారంటైన్‌కు సిద్ధపడే వారికి ఏపీలోకి అనుమతి ఇవ్వాలని వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఈ క్యాంపుల్లో కచ్చితంగా ఒక అధికారిని నియమించాలన్నారు. సరిహద్దు రాష్ట్రాల్లో కలెక్టర్లతో కూడా అధికారి మాట్లాడాలని పేర్కొన్నారు. సరిహద్దుల్లో అందుబాటులో ఉన్న కల్యాణ మండపాలు.. హోటళ్లను గుర్తించి శానిటైజ్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారికి సరిహద్దుల్లో భోజనం, వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.


నిత్యావసర వస్తువుల కొనుగోలు సమయాన్ని ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉన్న సమయాన్ని తగ్గించాలన్న అంశంపై సమావేశంలో అధికారులు ప్రస్తావించారు. నగరాలు, పట్టణాల్లో ఉన్న ప్రజలు, వారి సంఖ్యకు తగినట్టుగా రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలు ఉన్నాయా లేదా చూడాలని సీఎం సూచించారు. శాస్త్రీయంగా పరిశీలించి మ్యాపింగ్‌ చేయాలన్నారు. ప్రజలకు సరిపడా రైతు బజార్లు, నిత్యావసర దుకాణాలు అందుబాటులోకి తెచ్చిన తర్వాత సమయం తగ్గించే ఆలోచనలు చేయాలన్నారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాతే.. సమయం తగ్గింపుపై నిర్ణయాలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్‌ అన్నారు.


వాలంటీర్ల సర్వే, ఫలితాల ఆధారంగా తీసుకుంటున్న చర్యలపై సీఎం జగన్ ఆరా తీశారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చే డాక్టర్ల సేవలను ఉపయోగించుకోవాలన్నారు. వాలంటీర్లు, ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు గుర్తించిన వారిని డాక్టర్ దృష్టికి తీసుకెళ్లి వైద్యం అందించేలా చేయాలన్నారు. విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి 10 మందికి ఒక డాక్టర్ కేటాయించాలని సీఎం జగన్ అధికారులకు తెలిపారు. డాక్టర్లు, స్పెషలిస్టులు మధ్య వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పించాలని చెప్పారు. టెస్టింగ్ సామర్ధ్యాన్ని పెంచడంపై కూడా దృష్టి పెట్టాలన్నారు.