- రూ.240 కోట్లు చిక్కుకుపోవడంతో ఆందోళన
- జీతాల సొమ్ము 120 కోట్లు అందులోనే
- రోజువారీ కలెక్షన్లు 80 కోట్లు, పీఎఫ్ 40 కోట్లు
- రూ.50 వేలకు మించి డ్రాచేయలేని స్థితి
- డీజిల్ డబ్బుకోసమూ యాజమాన్యం కటకట
అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): దేశాన్ని కుదిపేస్తున్న యస్ బ్యాంక్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా వ్యవస్థకీ షాకిచ్చింది. ఏ నెలకు ఆ నెల అప్పులు తెచ్చుకుని బండి లాగించే పీటీడీకి ఏకంగా 240కోట్ల రూపాయల దెబ్బ కొట్టింది. రోజువారి చెల్లింపుల్లో భాగంగా సోమవారం ఉదయం బ్యాంకుకు వెళ్లి న అధికారులకు బ్యాంకు సిబ్బంది ఇచ్చిన సమాధానం తో దిమ్మతిరిగింది. ‘మీ అకౌంట్ నుంచి 50వేల రూపాయలకు మించి తీసుకోవడం సాధ్యం కాదు’ అని చెప్పడంతో అధికారులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. డీజిల్ కొనుగోలుకు డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలన్న ఆందోళన వారిలో మొదలైంది. అసలు విషయానికి వస్తే... ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడంతో యస్ బ్యాంకు ఇబ్బందుల్లో పడిన విషయం తెలిసిందే. గత 4రోజులుగా ఈ బ్యాంక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే పీటీడీ.. విజయవాడలోని యస్ బ్యాంకు హెడ్ ఆఫీసులో అకౌంట్ ప్రారంభించి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తోం ది. ఎప్పుడూ ఓడీలు వాడుకునే సంస్థకు జనవరి 2020 నుంచి సిబ్బంది జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుండటంతో అకౌంట్లో నిధులు నిల్వచేసుకునే అవకాశం లభించింది. జనవరి నెలకు సంబంధించిన జీతం ప్ర భుత్వం ఆర్టీసీకి ఫిబ్రవరిలో చెల్లించింది. ఈ డబ్బుల్లో నుంచి రూ.120కోట్లు యస్ బ్యాంకులోని ఆర్టీసీ ఖాతా లో జమ అయింది. దీంతోపాటు రోజువారీ కలెక్షన్ల డబ్బులు రూ.80కోట్లు ఏ రోజుకు ఆరోజు డిపాజిట్ చేశారు. సిబ్బంది జీతాల నుంచి రికవరీ చేసిన మరో 40కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇదే బ్యాంకులోని పీఎఫ్ ఖాతాకు బదిలీ చేశారు. దీంతో మార్చి మొదటి వారం ముగిసే నాటికి మొత్తం రూ.240కోట్లు యస్ బ్యాంకులో నిల్వఉంది. ఈ పరిస్థితుల్లో బ్యాంకు ఆర్థిక ఇబ్బందుల్లో పడటం, ఖాతాదారులు ఏటీఎంలకు క్యూ కట్టడంతో పరిస్థితి చేయిదాటి పోయింది. దీనిపై కలగజేసుకున్న కేంద్ర ప్రభుత్వం డిపాజిటర్లకు భరోసా ఇస్తూ నెల రోజుల పాటు లావాదేవీలు అతి తక్కువ గా జరపాలని యస్ బ్యాంకుపై నిబంధన విధించింది. ఫలితంగా ఆర్టీసీ లాంటి వందల కోట్ల రూపాయలు ఖాతాలో జమచేసిన సంస్థలు రూ.50వేలకు మించి తీసుకోలేని దుస్థితి! సోమవారం విజయవాడలోని ఆర్టీసీహౌ్‌సలో ఇది సంచలనమైంది. ఎక్కడచూసినా, విన్నా ఇదే చర్చ జరుగుతోంది.
వడ్డీకి ఆశపడి...జాతీయ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను ఇలాంటి బ్యాంకుల వైపు ఎందుకు మార్చారని ఒక అధికారి వద్ద ప్రస్తావించగా.. ‘వడ్డీకి ఆశపడి’ అంటూ ఆయన సమాధానమిచ్చారు. ఎస్‌బీఐ లాంటి బ్యాంకులు డిపాజిట్లకు తప్ప కరెంట్ అకౌంట్లకు వడ్డీ చెల్లించవు. యస్ బ్యాంకు అధికారులు ఆర్టీసీ అధికారులను సంప్రదించి కరెంట్ అకౌంట్ తమవద్ద ప్రారంభించాలని, రోజువారీ వడ్డీ చెల్లిస్తామని, అది కూడా 6.25శాతం ఇస్తామని ఆశ పెట్టడంతో వందల కోట్ల రూపాయలు అకౌంట్లో జమ చేశారు. ఇప్పుడు అసలుకే ముప్పు రావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నెల తర్వాతైనా మొత్తం డబ్బులు వస్తాయా..? అంటూ ఆరా తీస్తున్నారు.