కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ప్రజలు సైతం ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారు. అంతేగాక వివిధ సంస్థలు సైతం కరోనా నిర్మూలన కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా మార్చి 31 వరకు ఎపిలోని బ్యాంకుల పనివేళల్లో మార్పులు చేసినట్లు తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు మార్చి 24 (మంగళవారం) నుంచి 31 వ తేదీ వరకు అన్ని పనిదినాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. అదేవిధంగా బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరువడం, కొత్తగా రుణాలు మంజూరు చేయడం లాంటి సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి వెల్లడించింది. సిబ్బంది ఎక్కువ ఉన్న బ్యాంకుల్లో 50 శాతం మందితో పనిచేయించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతేగాక కరోనా ప్రభావిత ప్రాంతాల్లో తాత్కాలికంగా బ్యాంకులను మూసివేయాలని బ్యాంకర్ల సమితి నిర్ణయించింది.
ఎపి బ్యాంకుల పనివేళల్లో మార్పులు