న్యూఢిల్లీ : ఉన్నత విద్యకు వెనుకబడినవర్గాలు దూరమవుతున్నాయా? ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో వారి వారి సంఖ్య తగ్గుతున్నదా? స్వయంగా ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించిన నివేదిక అవుననే అంటున్నది. పీహెచ్‌డీల్లో చేరుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల సంఖ్య రిజర్వుడ్ స్థానాల కంటే తక్కువగా ఉంటున్నది. 2015-2019 మధ్యకాలంలో వీరి శాతం సింగిల్ డిజిట్‌ను దాటలేదని పార్లమెంటుకు ప్రభుత్వం సమర్పించిన గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. సీపీఐ(ఎం) ఎంపీలు ఎలమారం కరీం, కె సోమప్రసాద్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (హెచ్‌ఆర్డీ) ఈ గణాంకాలను ఇటీవల సమర్పించింది. ఎస్సీ విద్యార్థులకు 15శాతం సీట్లు, ఎస్టీ అభ్యర్థులకు 7.5శాతం రిజర్వు చేయగా.. అందులో చేరిన వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఐదేండ్ల (2015-2019)కాలంలో 23 ఐఐటీల్లో చేరిన మొత్తం 25,007 మంది పీహెచ్‌డీ స్కాలర్స్‌లో 9.1శాతం మంది ఎస్సీకి చెందినవారు కాగా, 2.1శాతం మంది ఎస్టీ విద్యార్థులు' అని నివేదిక పేర్కొంది. ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ)కు చెందిన విద్యార్థుల కోటా 27శాతం. కాగా. పిహెచ్‌డి విద్యార్థులలో 23.2శాతం మంది మాత్రమే ఓబీసీకి చెందినవారున్నారు. ఈ ఐదేండ్ల కాలంలో ఐఐటీల్లో పీహెచ్‌డీ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌లో 20శాతం పెరుగుదల ఉందని, అయితే ఎస్సీ, ఎస్టీ ఓబీసీ విద్యార్థుల నిష్పత్తిలో మాత్రం పెరుగుదల లేదని నివేదిక పేర్కొంది. మొత్తం 23 ఐఐటీల్లోనూ మొదటి ఐదు స్థానాల్లో మద్రాస్, బొంబాయి, న్యూఢిల్లీ, కాన్పూర్, ఖరగ్‌పూర్‌లలో 60శాతం పీహెచ్‌డీ ఎన్‌రోల్‌మెంట్ జరిగింది. కాగా వీటిల్లో వెనుకబడిన వారి సంఖ్య అత్యల్పం. ఉదాహరణకు.. ఐఐటీ కాన్పూర్లో చేరిన 1,653 మందిలో 11 (0.6శాతం) మంది మాత్రమే ఎస్టీ వర్గాలకు చెందినవారున్నారు.
ఐఐటీల్లో రిజర్వు స్థానాలకంటే తక్కువగా..
• R UMADEVI