ఉపాధిలో ఇళ్ల స్థలాల చదును పనులపై ఇంజనీర్లకు ఆదేశం
కరోనాలోనూ ఇవేం ఆదేశాలంటున్న ఇంజనీర్లు
ఇప్పుడు కుదరదని ప్రభుత్వానికి వినతి
రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి నిధులతో చేపట్టిన ఇంటి స్థలాల చదును పనులకు సంబంధించిన బిల్లులను నెలాఖరులోపు చేయాలని పంచాయతీరాజ్ విభాగానికి చెందిన ఉన్నతాధికారులు మండల ఇంజనీర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో ఓ వైపు కరోనాతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ ప్రకటించగా, ఈ నెలాఖరులోపు ఆయా పనులకు బిల్లులు రికార్డు చేయాలని పట్టుబడుతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల స్థలాల చదును పనులను ఉపాధి పథకం నిధులతో చేపట్టారు. కొన్నిచోట్ల ఈ పనుల్లో కూడా కొంత భాగం ఉపాధి నిధులతోను, మిగతా భాగం రాష్ట్ర కన్వర్జన్స్ నిధులతోను చేపట్టారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు పూర్తి కాగా, మరికొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. అయితే, ఈ నెలాఖరులోపు ఉపాధి మెటీరియల్ కాంపోనెంట్ బుక్ చేయకపోతే మురిగిపోతాయని, 30లోపు ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్(ఎ్‌ఫటీవో)లను అప్‌లోడ్ చేయాలని చీఫ్ ఇంజనీర్లు ఆదేశిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఉపాధి మెటీరియల్ కాంపోనెంట్ బిల్లులు చేసే అవకాశం లేనందున మిగతా జిల్లాల్లో ఈ పనులు పూర్తిచేయాలని సూచించారు. ఈ జిల్లాల్లో కొన్నిచోట్ల పనులు పూర్తి కాకపోయినా పూర్తి చేసినట్లు బిల్లులు చేయాలని ఒత్తిడి చేస్తుండటంపై ఇంజనీరింగ్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పుడు హడావుడిగా బిల్లులు చేయించుకుంటారని, ఆ తర్వాత విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో తాము ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల చదునుకు సంబంధించి ఉపాధి సిబ్బందితో బిల్లులు రికార్డు చేయిస్తూ తమను చెక్ మెజర్‌మెంట్ చేయమంటున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ‘ఎంబుక్’ రికార్డు చేయాల్సిన అధికారం పూర్తిగా మండల ఇంజనీర్లకు ఉంటుందని, అది పూర్తిగా కాంట్రాక్టు సిబ్బందికి అప్పగించి వాటిని సర్టిఫై చేయాలని తమను ఆదేశించడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రూ.5 లక్షలకు పైబడిన పనులకు ప్రీమెజర్‌మెంట్‌ను డ్రోన్లు ద్వారా తీశారని, అయినా డ్రోన్ల ఎస్టిమేట్లకు అనుగుణంగా ఎక్కడా పనులు జరగలేదని అంటున్నారు. పోస్టు డ్రోన్ మెజర్‌మెంట్ తీసుకోకుండా ఫైనల్ బిల్లులు ఎలా పూర్తిచేయాలని ప్రశ్నిస్తున్నారు. కరోనా కారణంగా పకడ్బందీ కట్టుబాట్లు ఉన్న నేపథ్యంలో పనులు పరిశీలించేందుకు కూడా వీలుకాదని చెబుతున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత పనులు రికార్డు చేస్తామని, అప్పటి దాకా ఒత్తిడి తేవొద్దని పంచాయతీరాజ్ డిప్లమో ఇంజనీర్ల అసోషియేషన్ అధ్యక్షుడు హనుమంతరావు ప్రభుత్వాన్ని కోరారు.