ఆర్థిక మాంద్యంలోకి జారిపోతున్నాం


న్యూస్ చరిష్మా :


మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన గణాంకాలు మనని అంతకంతకూ తికమక పెడుతున్నాయి. అంచనాలు రూపొందించే పద్ధతులనే మార్చివేస్తుండడం వల్ల ఇలా జరుగుతోంది. దీనికితోడు బిజెపి ప్రభుత్వం వచ్చాక, మన ఆర్థిక వ్యవస్థ తీరు బాగు లేదన్న సూచనలతో గణాంకాలు వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వం ఆ గణాంకాలను బైటకు వెల్లడి చేయకుండా తొక్కిపెడుతోంది. అయితే ప్రస్తుతం మన దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన స్థాయిలో మాంద్యంలోకి జారిపోతోందన్న వాస్తవాన్ని మాత్రం ఎవరూ దాచిపుచ్చలేరు. 2019 అక్టోబరు-డిసెంబరు త్రైమాసిక అంచనాల ప్రకారం మన జిడిపి (స్థూల జాతీయోత్పత్తి) 2018 లోని అదే త్రైమాసికంతో పోల్చితే 4.7 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. 2019 జూలై-సెప్టెంబరు త్రైమాసిక వృద్ధి రేటు 4.5 శాతం. జాతీయ గణాంకాల కార్యాలయం అంచనా ప్రకారం 2019-20 పూర్తయ్యేసరికి జిడిపి వృద్ధి రేటు 5 శాతం మించదు. పలు ఆర్థిక సంస్థలు, అధ్యయన సంస్థలు ఈ 5 శాతం వృద్ధి రేటు కూడా సాధ్యం కాదని చెప్తున్నాయి.
ఒకవేళ 5 శాతం వృద్ధి రేటు సాధించగలిగినా ఇది గత 11 సంవత్సరంలోకెల్లా కనిష్ట వృద్ధి రేటు అవుతుంది. ప్రస్తుతం వృద్ధి రేటును అంచనా వేయడానికి అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది. దీనివలన జిడిపి వృద్ధిని అతిగా అంచనా వేస్తున్నారు. మన వృద్ధి రేటు తగ్గుముఖం పట్టడానికి ముందు కాలంలో 7 శాతం వృద్ధి రేటు ఉన్నట్లు చెప్పుకున్నాం. కాని వాస్తవంలో అది 4.5 శాతాన్ని మించదని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు స్పష్టంగా ప్రకటించారు. ఆ లెక్కన ఈ సంవత్సరం 5 శాతం ఉంటుందని చెప్తున్న వృద్ధి రేటు వాస్తవంలో 3 లేదా 3.5 శాతానికి మించి వుండకపోవచ్చు. పాత రోజుల్లో ఈ స్థాయి వృద్ధి రేటును 'హిందూ వృద్ధి రేటు' అని వేళాకోళం ఆడేవాళ్లు.
ఇప్పుడు 'హిందూత్వ' శక్తులే అధికారంలోకి వచ్చినందున మన వృద్ధి రేటు కాస్తా 'హిందూ వృద్ధి రేటు' అయిపోయినట్టుంది. అయితే పాతకాలపు 'హిందూ వృద్ధి రేటు', ఇప్పుడున్న 3-3.5 వృద్ధి రేటు పైకి చూడడానికి సమానంగానే కనపడుతున్నప్పటికీ, సారాంశంలో తేడా వుంది.
పాత రోజుల్లో జిడిపి 3.5 వృద్ధి రేటుతో ఉన్నా, అప్పుడు సాధించిన ఉపాధి కల్పన వృద్ధి ఇప్పటితో పోల్చితే చాలా ఎక్కువ. ఆ రోజుల్లో సాంకేతికంగా గాని, వ్యవస్థీకృతంగా గాని మార్పులు ప్రవేశ పెట్టినప్పుడు ఉద్యోగాల కుదింపుకు (విఆర్‌ఎస్‌ వగైరా) ఆమోదం ఉండేది కాదు. రెండవ అంశం : ఆ పాత రోజులతో పోల్చితే ఆదాయాల్లో వ్యత్యాసాలు ప్రస్తుత కాలంలో (నయా ఉదారవాద కాంలో) బాగా పెరుగుతున్నాయి. 1980 దశకపు తొలి నాళ్లలో దేశ ఆదాయంలో అత్యంత సంపన్నులైన ఒక శాతం ధనికుల వాటా 6 శాతం ఉండేది. 2013-14 నాటికి అది కాస్తా 22 శాతానికి (3.7 రెట్లు) పెరిగింది. భారత దేశంలో ఆదాయ పన్ను విధింపు మొదలుపెట్టింది 1922లో. అప్పటి నుంచీ ఇప్పటి వరకు గడిచిన శతాబ్దపు కాలంలో ఆదాయాల్లో వ్యత్యాసాలు ఇంతగా పెరగడం ఇప్పుడే జరుగుతోంది. ఇక మూడవ అంశం : మొత్తం వృద్ధి రేటు పెరుగుదలను ఆరోజుల్లో నిలబెట్టినది వ్యవసాయ రంగంలో గణనీయంగా సాధించిన వృద్ధి రేటు. మరీ ముఖ్యంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిలో వృద్ధి. దానివలన తలసరి ఆహార ధాన్యాల లభ్యత గణనీయంగా పెరిగింది. 1900 సంవత్సరంలో ఆహార ధాన్యాల లభ్యత ఏడాదికి ఒక మనిషికి 200కి లోటు ఉండేది. అది స్వతంత్రం వచ్చే నాటికి 140 కిలోలకు పడిపోయింది. స్వాతంత్య్రానంతరం మళ్లీ పుంజుకుంటూ 1980 నాటికి 180 కిలోలకు పెరిగింది. ఆ తర్వాత నయా ఉదారవాద కాలంలో మళ్లీ పడిపోవడం మొదలై కొనసాగుతోంది.
అంటే నయా ఉదారవాద విధానాలు ప్రవేశించక పూర్వం వృద్ధి రేటు తక్కువగానే ఉన్నా, ఆ కాలంలో జరిగిన వృద్ధి అన్ని తరగతులలోనూ జరిగింది. ఆకలిని చాలా వరకు తొలగించగలిగింది. నయా ఉదారవాద కాలంలో వృద్ధి రేటు ఉచ్ఛదశలో ఉన్నప్పుడు కూడా ఆ మేరకు ఆకలిని తొలగించలేకపోయారు. ఇక వృద్ధి రేటు తగ్గుతూన్న ప్రస్తుత కాలంలో ఆకలి పెరుగుతోందని వేరే చెప్పాలా?
2018-19లో వృద్ధి రేటు 6.1 అని అంచనా వేశారు. ఇప్పుడు 2019-20లో అంతకన్నా తక్కువ ఉంది. ఇలా తగ్గడానికి ప్రధాన కారణం వ్యవసాయేతర రంగాలలో వృద్ధి తగ్గడం. వ్యవసాయ రంగంలో 2018-19లో 2.88 శాతం అయితే 2019-20లో 2.9 శాతం. అంటే దాదాపు నిలకడగా ఉంది. తగ్గినది తక్కిన రంగాలలోనే. పారిశ్రామిక రంగంలో, మరీ ముఖ్యంగా వస్తూత్పత్తి రంగంలో ఈ తగ్గుదల మరీ కొట్టవచ్చినట్టు కనపడుతోంది. 2019-20లో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో గాని, జూలై-సెప్టెంబరు త్రైమాసికంలోగాని పారిశ్రామిక వృద్ధి రేటు ఏమీ లేకపోగా తిరోగమనంలో ఉంది. (మైనస్‌లో ఉంది) అయినా, సంవత్సరం ముగిసే నాటికి (మార్చి 2020) రెండు శాతం వృద్ధి రేటు ఉంటుందని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇది ఒక విధంగా అత్యాశే. ఒక పక్క వ్యవసాయంలో వృద్ధి రేటు స్థిరంగా కొనసాగుతూంటే పారిశ్రామిక రంగంలోనూ వృద్ధి రేటు ఉండవలసింది పోయి తిరోగమనంలో ఎందుకు పడింది?
దీనికి మూడు మౌలిక కారణాలు ఉన్నాయి. మొదటిది : వ్యవసాయంలో వృద్ధి రేటు కొనసాగుతోంది అంటే గ్రామీణుల వినిమయ శక్తి కూడా అదేవిధంగా వృద్ధి చెందుతోందని భావించరాదు. వ్యవసాయంలో వృద్ధి రేటు బాగా ఉన్న రోజుల్లో కూడా గ్రామీణ ప్రజల వినిమయ వ్యయంలో పెరుగుదల నామమాత్రంగానే కనపడింది. 2017-18లో బంపర్‌గా పంటలు పండాయి. కాని జాతీయ నమూనా సర్వే ప్రకారం గ్రామీణ ప్రజల వినిమయం ఆ సంవత్సరం తక్కువగానే ఉంది. 2011-12తో పోల్చితే (ఆ సంవత్సరం కూడా పంటలు బాగా పండాయి) గ్రామీణుల కొనుగోలు వ్యయం 8 శాతం పడిపోయింది. దీనికి ప్రధాన కారణం ఏంటి? విద్య, వైద్యం వంటి అత్యవసర సేవలు ప్రైవేటు రంగ ఆధిపత్యంలోకి పోయి వాటి కోసం గ్రామీణ ప్రజలు వెచ్చించాల్సిన ఖర్చు విపరీతంగా పెరిగింది.
రెండోది : మన దేశీయ మార్కెట్‌ కన్నా, నయా ఉదారవాద కాలంలో విదేశాల నుండి వచ్చే సరుకుల మార్కెట్‌ వేగంగా పెరుగుతోంది. మరో పక్క మన ఎగుమతులు పెద్దగా పెరగలేదు. అంతర్జాతీయ మార్కెట్‌ నుండి ఎదురయ్యే పోటీని తట్టుకోవడానికి దేశీయ మార్కెట్‌ కూడా తక్కువ జీతాలకే పని చేయించుకుంటూ పోటీలో నిలబడేందుకు తక్కువ రేట్లకి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. మన కంటే బలంగా ఉన్న అంతర్జాతీయ మార్కెట్‌ శక్తులు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. అందువల్ల ఆర్థిక సంక్షోభ భారం మన దేశం మీదకి ఎక్కువ రుద్దడం జరుగుతోంది. పర్యవసానంగా మన పారిశ్రామిక వృద్ధి రేటు హరించుకుపోయింది.
ఇక్కడో విషయాన్ని మనం గమనించాలి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రవేశానికి, పెట్టుబడుల ప్రవాహానికి తలుపులు బార్లా తెరవడం వలన ఐ.టి రంగ సేవలు వంటి రంగాలలో మన ఎగుమతులు పెరిగాయి. అదే సమయంలో మన పారిశ్రామిక రంగంలో మనం వృద్ధి కోల్పోయాం. సేవా రంగంలో పెరిగినది, పారిశ్రామిక రంగంలో కోల్పోయినది రెండింటినీ కలిపి చూసినా నికరంగా మనం పెరగలేదు. ఉదారవాద విధానాల ముందు కాలం నాటి పెరుగదల రేటుకే మళ్లీ వచ్చేశాం.
తూర్పు ఆసియా దేశాల నుండి, ముఖ్యంగా చైనా నుండి వచ్చే దిగుమతులతో మన దేశవాళీ మార్కెట్‌ పోటీ పడి నిలదొక్కుకోవడం చాలా కష్టంగా ఉంది. అదే సమయంలో మన ఎగుమతులలో సాధించిన చెప్పుకోదగ్గ పురోగతీ లేకుండా పోయింది. ఇప్పుడు నయా ఉదారవాద విధానాల పంథా ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కొండ అంచు వరకు తెచ్చింది. ఇక పురోగమించేందుకు ముందు దారి లేదు. నయా ఉదారవాద విధానాలు చూపగలిగే పరిష్కారమూ ఏదీ లేదు. ఈ పరిస్థితుల్లో మన దేశంలో పారిశ్రామిక రంగంలో నెలకొన్న మందగమనం కాస్తా తిరోగమనంగా మారింది. మరోపక్క ఐ.టి రంగం వంటి సేవా రంగాలలో ఇంత వరకూ చూపగలుగుతున్న పురోగతీ ఇక ముందు ఉండేలా లేదు. దీని ఫలితంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలం పాటు ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయే ప్రమాదం దాపురించింది.
ఈ పారిశ్రామిక రంగపు మాంద్యం తన ప్రభావాన్ని ఎలా చూపనుంది? మాంద్యం కారణంగా యంత్రాలు, టెక్నాలజీ వంటి 'క్యాపిటల్‌ గూడ్స్‌' రంగంలో ముందు ముందు ఎవరూ మదుపులు పెట్టరు. కొనుగోలుదారుల శక్తి తగ్గిపోతున్నప్పుడు ఇటువంటి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాలేరు.
ఈ పరిస్థితులనెలా సరిదిద్దాలో బిజెపి ప్రభుత్వానికేమీ అర్థం అయినట్టు లేదు. కార్పొరేట్‌ పన్నులో భారీ రాయితీ ఇచ్చింది. అంటే పారిశ్రామికవేత్తలకు పన్ను రాయితీ ఇచ్చింది. అలా రాయితీ పొందిన సొమ్మును పారిశ్రామికవేత్తలు తిరిగి మార్కెట్‌లో పెట్టుబడి పెడతారని ప్రభుత్వం అంటోంది. కాని అలా ఎంతమాత్రమూ జరగదు. మార్కెట్‌లో కొనేవాళ్లుంటే వారికి అమ్మేందుకు, సరుకులు తయారు చేసేందుకు ఎవరన్నా మదుపులు పెడతారు గాని రాయితీలిచ్చినంత మాత్రాన పెడతారా? పైగా, ఇలా రాయితీలిచ్చినందున ప్రభుత్వం తన ఆదాయంలో భారీగా కోల్పోయింది (కార్పొరేట్‌ పన్ను రాయితీ సుమారు రూ.1,47,000 కోట్లు). దాని పర్యవసానంగా ప్రభుత్వం చేసే ఖర్చు తగ్గిపోతుంది. అంటే ప్రజలకు చేరవలసిన సొమ్ము చేరదు. దానివలన ఆ ప్రజల కొనుగోలు శక్తి మరింత పడిపోతుంది.
జిఎస్‌టి రేట్లను కాస్త అటు, ఇటు సవరిస్తామని, 'మేక్‌ ఇన్‌ ఇండియా' ప్రచారాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వం అంటోంది. ఏ రాయితీలిచ్చినా, ప్రభుత్వ ఆదాయం తగ్గడానికి, రెవిన్యూ లోటు పెరగడానికే దారితీస్తుంది తప్ప పెట్టుబడులు పెరగడానికి కాదు. ప్రపంచమే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతూంటే 'మేక్‌ ఇన్‌ ఇండియా'కు స్పందించి పెట్టుబడులతో వచ్చే వారెవరుంటారు? ఎవరైనా వద్దామని అనుకున్నా ఇక్కడ ముస్లింలపై జరుగుతున్న దాడులు, ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనలు, చూసి మనసు మార్చుకుంటారు.
మన దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్థిక మాంద్యంలో చిక్కుకుపోయింది. దీని నుంచి బైట పడాలంటే ముందు సమాజంలో శాంతి, సామరస్యం నెలకొనాలి. దానితో బాటు నయా ఉదారవాద విధానాల చట్రాన్ని బద్దలు గొట్టుకుని ప్రభుత్వం కొత్త ఆర్థిక విధానంతో ముందుకు రావాలి. దాని గురించి మోడీ ప్రభుత్వానికేమీ తెలియదని చెప్పగలను. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికిస్తున్న కరోనా వైరస్‌ ముప్పు ప్రభావం దీనికి అదనంగా తోడైన సవాలు!