సూడాన్‌ ప్రధానిపై హత్యాయత్నం


కెయిరో : తనపై జరిగిన హత్యాయత్నం నుండి సూడాన్‌ ప్రధాని అబ్దుల్లా హందోక్‌ కుటుంబ సభ్యులతో సహా తృటిలో తప్పించుకున్నారు. హందోక్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ప్రయాణిస్తున్న కాన్వారు లక్ష్యంగా ఏర్పాటు చేసిన మందుపాతర, దానిని దాటిన తరువాత పేలటంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే తుది సమాచారం అందే సమయానికి ఈ దాడికి ఏ ఒక్కరూ తమ బాధ్యతను ప్రకటించలేదు. సూడాన్‌లో గతంలో అధికార పగ్గాలను స్వీకరించిన సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎగసిపడిన ప్రజాస్వామ్య ఉద్యమం ధాటికి అధ్యక్షుడు ఉమర్‌ అల్‌ బషిర్‌ నేతృత్వంలోని సైనిక ప్రభుత్వం తప్పుకుని హందోక్‌ నేతృత్వంలోని పౌర ప్రభుత్వానికి గత ఆగస్టులో పగ్గాలను అప్పగించిన విషయం తెలిసిందే. పౌర ప్రభుత్వానికి అధికార పగ్గాలను అందించటం ఇష్టంలేని కొందరు సైనికాధికారులు దేశానికి డిఫ్యాక్టో పాలకులుగా తమ హవాను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. బషీర్‌ పదవి నుండి తప్పుకునే సమయానికి దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. 2019లో సూడాన్‌లో ద్రవ్యోల్బణం 60 శాతానికి చేరుకోగా నిరుద్యోగిత 22.1 శాతానికి చేరుకున్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది.