బీపీ మాత్ర ఇలా...


అధిక రక్తపోటు సమస్య ఉన్న వారిలో ఎక్కువ మంది ఉదయం పూటే మాత్రలు వేసుకుంటారు. అయితే ఉదయం కన్నా రాత్రి పూట వేసుకోవడమే ఎక్కువ ఆరోగ్యకరమని ఒక అధ్యయనంలో బయటపడింది. రాత్రిపూట వేసుకోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం, గుండె వైఫల్యాల వంటి సమస్యలు సగం దాకా తగ్గుతాయని అధ్యయనకారులు కనుగొన్నారు. ‘యూరోపియన్‌ హార్ట్‌ జర్నల్‌’ అనే మెడికల్‌ జర్నల్‌ తాజా సంచికలో ప్రచురితమైన ఒక వ్యాసంలో ఈ వివరాలు ఉన్నాయి. వ్యాసకర్తలు చేసిన అధ్యయనంలో భాగంగా రోజూ మాత్రలు వేసుకునే 19 వేల మందిని పరిశీలించారు. ఈ మధ్య కాలంలో ఉదయం వేళ మాత్రలు వేసుకునే వారిలో 1800 మంది ఏదో ఒక రకమైన గుండె సమస్యలకు గురయ్యారు. ప్రత్యేకించి 521 మందిలో గుండె పనితనం తగ్గితే, 345 మంది పక్షవాతానికి గురయ్యారు. 302 మంది స్టెంట్‌లు వేయాల్సినంత రక్తనాళాల సమస్యలు వస్తే, 274 మందికి తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారు. అయితే రాత్రివేళ మాత్రలు వేసుకునే వారిలో పక్షవాతం 49 శాతానికి, గుండెపోట్లు 44 శాతానికి, గుండె పనితనం తగ్గడం 42 శాతానికి, స్టెంట్‌లు వేసే పరిస్థితి 40 శాతానికి తగ్గినట్లు తేలింది. మొత్తంగా చూస్తే వివిధ రకాల గుండె రక్తనాళాల సమస్యలతో కలిగే మరణాల సంఖ్య 45  శాతానికి తగ్గినట్లు స్పష్టమైంది. అందుకే అధిక రక్తపోటు మాత్రలు ఉదయం వేళ కన్నా రాత్రివేళ వేసుకోవడమే ఎక్కువ ప్రయోజనకరమనే నిర్ధారణకు వారు వచ్చారు