తల నరుక్కున్న సూరీడు


ఇంతకీ నువ్వు ఓడినట్టా, గెలిచినట్టా


గెలుపుకొండ మీద


పల్లవి తెగిన పాటగా రాలిపడ్డట్టా


మరి, పరిగెత్తే కాలం మీద పల్లకీలో విర్రవీగే నువ్వు


ప్రతి మలుపులోనూ ప్రశ్నవై స్వరం తప్పడమెందుకు?


 


ఇంతకీ నువ్వు నిండుగడపలా మిడిసిపడుతున్నట్టా


పిల్లల్లేని ఇంటిలా పెళుసుబారినట్టా


మలిపేసుకున్న దీపంలా మిగులుపడ్డట్టా


మరి, ఒడుపు కాలాన్ని ఒడిసిపట్టి


వలేసి దూసుకున్న మెరుపులన్నీ


నిన్ను పొగమంచు పొద్దుల్లోకి


వలస పంపుతున్నాయెందుకు?


 


ఇంతకీ నువ్వు బహువచనమై విరజల్లుకున్నట్టా


ఏకవచనమై దిక్కుల్ని పగలగొట్టుకున్నట్టా


లయలెరుగని లోయల్లో సుడిగుండమైపోయినట్టా


మరి, నీ నట్టింట్లోకి నడిచొచ్చిన గెలుపులన్నీ


ఒక్కొక్కటిగా ఓటముల వెనక్కి వెలేస్తుంటే


ఎక్కుపెట్టుకోవడమెరుగని బాణమై


గుటకలు మింగడమెందుకు?


 


మట్టినీ, మబ్బునీ తడిమి


గుట్టనూ, గువ్వనూ నిమిరి


ఆకునూ అడవినీ అల్లుకుపోయినప్పుడు


కొత్త కవిత్వంలా భూలచ్చిమి


కళలు పోయిన కాలాల మీద


వెన్నమీగడలా రుచులు పోయిన సందర్భాల మీద


ఇప్పుడే పలకరింత వాలుతోంది-


ఎదుగుతున్న కన్నీటి ఊట తప్ప


చివరి ఘట్టాల కవాతు తప్ప


 


బతుకుపాఠం బిక్కచచ్చిపోయిన దిబ్బల్లో


ఏరుకున్న ముళ్లపాటలకు


బాణీలు వెతుక్కునే వేళల్లో


కొత్త భాషలాడాల్సిన రుతుశోభల మీద


ఇప్పుడే ఆకాశం వంగి వంగి వడ్డించుకుంటోంది-


నేలనేలంతా నువ్వు పేనిన తలాపిదీపాల


మిణుకు మిణుకులు తప్ప!


చైనా మాంజాలో గింజుకుంటున్న పిట్టల రెక్కలు


విరిగిపోతున్న చప్పుడు తప్ప!


----


 


కణాన్ని తరచి, అణువును విరిచి, ఖగోళాన్ని ఈది


అంతరిక్షం ఆవలకు అడుగులు పరచి


జీవాండ పిండ బ్రహ్మాండాలన్నిటినీ చెరచి


శోధించి పరమాణు బలాన్ని ఛేదించి చెరపట్టావు సరే...


లోకాన్నంతా ఆయాసపడమని శపించి


నువ్వు విరజిమ్మిన విషాల్లో మరగబెట్టి


అనంతంగా శ్వాసల్ని వడగొట్టి


వెన్నెలల్ని పిండుకుంటున్నావు సరే...


మరి, అప్పుడో ఇప్పుడో-


కన్ను కానని గత్తర కణాలు


కసికొద్దీ నిన్నో ప్రయోగశాలని చేసుకుని


విహ్వలత అంచున వేలాడదీసి


నాడుల నిండా కార్చిచ్చుల్ని పేర్చుతుంటే


కనీసం మిణుగురుల తొవ్వల్ని కూడ


మిగుల్చుకోలేని నువ్వేం విజేతవి?


జీవమని కూడా అనలేని అర్ధజీవాలు


నిన్నో పీనుగుల కుప్పని చేసి తాండవమాడుతుంటే


ఊపిరి కొసన కాసిన్ని నక్షత్రాలు కూడ వేలాడక


నవ్వులపొద్దుల విడిదిళ్ల కోసం


కాలం మళ్లేసుకొచ్చే ఉగాదుల కోసం


ఉగాదులు వెంటేసుకొచ్చే కోయిలల కోసం


గుక్కపట్టే నువ్వేం మనిషివి?


---


సరేలే,


ఊపేసే గాలికి ఊగిపోయే కొమ్మంచున 


తూలితూలి వాలిన పిట్టలా


చివరికి నువ్వే గెలుస్తావేమోలే కానీ


నీ గెలుపెంత రెక్కచాచుకున్న ఓటమో 


తెలిసొస్తున్న ప్రతిసారీ- నువ్వెప్పుడూ-


కాలం గర్భగుడి ముందు దిగుడు మెట్టువే!


శార్వరి ఒడిలో తలనరుక్కున్న సూరీడువే!