కరోనాతో స్థానిక ఎన్నికల వాయిదా.. గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు, ఎస్పీలపై వేటు


కరోనా వైరస్ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. యథావిధిగా ఎన్నికల కోడ్ కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల అధికారి రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియ రద్దుకాదని, ఏకగ్రీవంగా ఎన్నికైనవారు కొనసాగుతారని అన్నారు. ఆరు వారాల తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. అత్యున్నత స్థాయి సమీక్ష తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల అధికారి పేర్కొన్నారు. సాధారణ పరిస్థితులు నెలకున్న తర్వాతే ఎన్నికలను నిర్వహిస్తామని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలియజేశారు.