రాహుల్‌ది త‌ప్పేం లేదు.. బాటిల్స్‌తో కొట్టి చంపేస్తారా ఏంటి?: ప‌్ర‌కాష్ రాజ్‌


ఇటీవ‌ల గ‌చ్చిబౌళిలోని ప్రిజ‌మ్ ప‌బ్‌లో సింగ‌ర్‌, బిగ్‌బాస్ 3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. తాండూరు ఎమ్యెల్యే బంధువులు రితేష్ రెడ్డి స‌హా అత‌ని స్నేహితులు రాహుల్‌పై దాడి చేయ‌డ‌మే కాకుండా అత‌ని త‌ల‌పై బీరు బాటిల్స్‌తో దాడి చేశారు. ఆ వీడియో ఫుటేజ్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు న్యాయం చేయాలంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా రాహుల్ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞ‌ప్తి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై రాహుల్ సిప్లిగంజ్‌కు ప్ర‌ముఖ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ త‌న మ‌ద్ద‌తుని తెలిపారు. 


ఈ సంద‌ర్భంగా ప్ర‌కాష్‌రాజ్ మాట్లాడుతూ రాహుల్‌కు అన్యాయం జ‌రిగింద‌న్నారు. ప‌బ్‌కు వెళ్ల‌డం త‌ప్పు కాద‌ని, ప‌ది మంది కలిసి ఒక‌డిని కొట్ట‌డం త‌ప్ప‌ని  అన్నారు ప్ర‌కాష్ రాజ్‌. జ‌రిగిన గొడ‌వ‌లో రాహుల్‌ది త‌ప్పేమీ లేద‌ని, పోలీసు ఉన్న‌తాధికారుల‌తో మాట్లాడుతాన‌ని ఆయ‌న‌ అన్నారు. త‌ప్పు లేన‌ప్పుడు ఎందుకు కాంప్ర‌మైజ్ కావాల‌ని ప్ర‌శ్నించారు ప్ర‌కాష్‌రాజ్‌. రాహుల్‌పై క‌క్ష‌తో గొడ‌వ జ‌ర‌గ‌లేద‌ని, వీడియో చూస్తే బాటిల్స్ కొడుతున్నారు. బాటిల్‌తో కొట్టి చంపేస్తారా..ఏంటి? అదేం ధైర్యం? ఇద్ద‌రు మ‌ధ్య గొడ‌వ‌లు, బిన్నాభిప్రాయాలు ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి కానీ.. దాడి చేయ‌మేంట‌ని ప్ర‌శ్నించారు ప్ర‌కాశ్‌రాజ్. న్యాయం కోసం పోరాడుతాన‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌కాష్‌రాజ్ తెలిపారు .