కష్టకాలంలో ఇటలీకి భారత్‌ సాయం


కరోనా మహమ్మారి కొట్టిన దెబ్బతో ఇటలీ విలవిల్లాడుతోంది. ఇప్పటికే ఆ దేశంలో ఈ వైరస్‌ బారిన పడి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలమైన ఆ దేశం ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో బిక్కుబిక్కుమంటోంది. ఈ నేపథ్యంలో ఇటలీని ఆదుకునేందుకు భారత్‌ పెద్ద మనుసు చాటుకుంది. ఆ దేశానికి వైద్య పరికరాలు, ముసుగులు పంపించింది. భారత్‌ చేసిన సాయాన్ని స్వాగతిస్తూ.. కష్టకాలంలో తమకు అండగా ఉన్న భారత్‌కు కృతజ్ఞతలు అని ఇటీలీ విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఇదే కాదు.. గత నెలలో చైనాకు సైతం భారత్‌ కోట్ల రూపాయల విలువైన వైద్య పరికాలు అందించింది. కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్న చైనాకు వైమానిక విమానం ద్వారా సామగ్రిని సరఫరా చేసింది. భూటాన్, మాల్దీవులకు కూడా భారత్ సహకారం అందించింది. ఇటీవల నిర్వహించిన సార్క్‌ సమావేశంలో భారత ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కష్టకాలంలో ఉన్న ఏ దేశానికైనా సాయం చేసేందుకు భారత్‌ సిద్ధంగా ఉంటుందని సార్క్‌ సభ్య దేశాలకు అభయమిచ్చిన సంగతి తెలిసిందే.