తెలంగాణ నుంచి ఏపీకి వెళుతూ, అక్కడి పోలీసులు అనుమతించకపోవడంతో రోడ్డుపైనే నిలిచిపోయిన వారిని ఏపీలోకి అనుమతించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి వేలాది మంది కార్లు, బైక్‌ల మీద ఏపీలోని సొంత ఊళ్లకు వెళ్లిపోవడానికి ప్రయత్నించడంతో వారిని జగ్గయ్యపేట వద్ద ఆపేశారు. దీంతో ఈ విషయంపై ఏపీ సీఎం వైఎస్.జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరిపారు. కోవిడ్–19 నివారణలో భాగంగా ప్రస్తుతం ఎక్కడి వారిని అక్కడే ఉండేట్టుగా చూడాలని నిర్ణయించారు. అయితే, జగ్గయ్యపేట వద్ద ఉన్న ఏపీ వారికి హెల్త్ ప్రోటోకాల్ పాటించి రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు. ఇక హైదరాబాద్ నుంచి ఎవ్వరు వచ్చినా అనుమతించేది లేదని స్పష్టంచేశారు. ఇలా చేయడంవల్ల వారికేకాక, కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా రిస్క్‌లో పెట్టినట్టే అవుతుందని అధికారులు చెప్పారు. దయచేసి ఎక్కడివారు అక్కడే ఉండాలని ఏపీ అధికారులు కోరారు. హాస్టళ్లు, పీజీ మెస్‌లు మూసివేయవద్దంటూ ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం, మంత్రుల ఆదేశాలు జారీ చేయడంతో భయపడొద్దని సూచించారు.
తెలంగాణలోని ఏపీ వాసులు సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు ప్రయత్నించగా... వారికి చేదు అనుభవం ఎదురైంది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఏపీలోకి వెళ్లేందుకు ప్రజలు వస్తుండగా... పోలీసులు మాత్రం వారికి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో జగ్గయ్యపేట ప్రాంతంలోని ఏపీ సరిహద్దుల్లో మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. తమ దగ్గర తెలంగాణ పోలీసులు ఇచ్చిన ఎన్ఓసీ సర్టిఫికెట్ ఇచ్చారని పలువురు ఏపీ పోలీసులకు చెబుతున్నా... వారి నుంచి సరైన సమాధానం రావడం లేదని బాధితులు వాపోయారు.
అయితే ఈ విషయంలో పోలీసులు మాత్రం మరో రకమైన సమాధానం ఇస్తున్నారు. లాక్ డౌన్ ఉన్న కారణంగానే తాము ఎవరినీ అనుమతించడం లేదని అన్నారు. వీరిందరికీ పరీక్షలు నిర్వహించడమా ? లేక క్వారంటైన్‌కు పంపడమా అన్నది తేలాల్సి ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. చివరకు ఇద్దరు సీఎంలు చర్చించిన తర్వాత ఏపీ వారిని ఆ రాష్ట్రంలోకి అనుమతించాలని నిర్ణయించారు.