రాజ్యసభ సభ్యులను వైసిపి అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన రెడ్డి ఖరారు చేశారు. ప్రస్తుతం రాష్ట్రమంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌లతో పాటు వైసిపి నాయకులు ఆళ్ల ఆయోధ్య రామిరెడ్డిని, రిలయన్స్ ఇండిస్టీస్ గ్రూప్ కార్పొరేట్ వ్యవహారాల అధ్యక్షులు, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్న పరిమళ నత్వానిని ఎంపిక చేశారు. మోపిదేవి, చంద్రబోస్ శాసనమండలి కోటాలో మంత్రులుగా కొనసాగుతున్నారు. జనవరిలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో శాసన మండలి రద్దుకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో వీరికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం కల్పిస్తానని వైఎస్ జగన్ హామీనిచ్చారు. అదేవిధంగా వీరిద్దరికి అవకాశం కల్పించడం వల్ల బిసిలకు 50శాతం సీట్లు ఇచ్చిన్నట్లు అవుతుందని వైఎస్ జగన్ భావించారు. అందులో భాగంగానే వీరిని రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేశారు. మరో అభ్యర్ధి అయోధ్య రామిరెడ్డి 2014లో నరాసరావుపేట నుంచి వైసిపి లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో పార్టీ నుంచి నరసరావుపేట లోక్‌సభ టికెట్ ఆశించారు. అయితే పార్టీ అధిష్టానం మేరకు బరిలో నుంచి తప్పుకున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీలో క్రీయాశీలక పాత్ర పోషించారు. ఆయన సోదరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. నాల్గవ అభ్యర్ధిని రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కోరిక మేరకు జగన్ ఎంపిక చేశారు. ఫిబ్రవరి 29న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసి పరిమళ నత్వానిని ఎపి నుంచి రాజ్యసభకు పంపాలని కోరారు. జార్ఖండ్ నుంచి తొలిసారి 2008లో నత్వానీ రాజ్యసభకు ఎన్నికయ్యారు. రెండో సారి అదే రాష్ట్రం నుంచి 2014 నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా కొనసాగుతున్నారు.
రాజ్యసభ అభ్యర్థులు ఖరారు