డ్యాన్స్‌ బామ్మా.. డ్యాన్స్‌


స్థ్థలం.. కేరళలోని కొచ్చి. అక్కడి ఎడప్పల్లి నృత్య ఆస్వాదక సదస్‌లో 26 మంది మహిళలు భరతనాట్యం, మోహినీ ఆట్టం నేర్చుకుంటున్నారు. అందరూ యాభైఏళ్లు పైబడ్డవాళ్లే. ఆ గ్రూప్‌లోని అందరికన్నా పెద్దావిడకు 75 ఏళ్లు. వాళ్లకు డాన్స్ నేర్పుతున్న టీచరమ్మకు 30 ఏళ్లుంటాయి. చిన్నప్పుడు డాన్స్ నేర్చుకోవాలని ఉన్నా.. కుటుంబం, పరిస్థితులు, ఇతర కారణాల ఆ ఇష్టాన్ని మనసులోనే దాచుకొని .. కళ పట్ల ఆరాధన పెంచుకుంటూ... జీవితంలో ఎప్పుడు అవకాశం దొరికినా నృత్యం నేర్చుకొని తీరాలన్న కలను సాకారం చేసుకుంటున్న వారే అందరూ. తమను తాము ప్రేమించుకుంటూ.. తమ కోసం సమయం చిక్కించుకున్న వారే అంతా! ‘మాలాంటి వాళ్ల కోసమే ఈ డాన్స్ ఇన్స్ స్టిట్యూట్‌ స్టార్ట్‌ అయింది. మొదట్లో అడుగులు వేయడానికి చాలా కష్టపడ్డాం. అయినా ప్రాక్టీస్‌ ఆపలేదు. చిన్నప్పుడు చేయాలనుకున్నది ఇప్పటికి గానీ సాధ్యపడలేదు. బెటర్‌ లేట్‌ దేన్స్  ఎవర్‌ అంటారు కదా (నవ్వుతూ). నిజం చెప్పొద్దూ.. మాకు నచ్చింది చేసుకోవడానికి మా పిల్లలూ ప్రోత్సహిస్తున్నారు’ అంటూ 60 ఏళ్ల లీనా చెప్తూంటే ‘పిల్లలు అంటే కొడుకులు అనుకుంటారేమో.. కాదు కూతుళ్లు, కోడళ్లు అని చెప్పండి లీనా’ అంటూ ఆమె పక్కనే ఉన్న ఉష మాటందుకున్నారు.



 


‘అవునవును.. నా విషయంలో నా మనవలు, మనవరాళ్లు కూడా’ అంటూ శ్రుతి కలిపింది 75 ఏళ్ల మామ్మ. గత సంవత్సరం దసరా రోజున ప్రారంభమైంది ఈ నృత్య ఆస్వాదక సదస్‌. ఈ 26 మందిలో గృహిణి నుంచి టీచర్, డాక్టర్, రిటైర్డ్‌ ఉద్యోగినుల దాకా ఉన్నారు. ఈ నాట్యాలయానికి వచ్చాకే వీళ్లంతా స్నేహితులయ్యారు. ‘ఈ ఇన్‌స్టిట్యూట్‌ మాకొక థెరపీ క్లినిక్‌ లాంటిది. డ్యాన్స్‌ సరే.. ఈ వయసులో ఇంతమంది కొత్త ఫ్రెండ్స్‌ అయ్యారు. రకరకాల అభిరుచులు ఉన్నవాళ్లమే అంతా. ఇంటి విషయాల నుంచి హాబీస్, స్పోర్ట్స్, సినిమాలు.. వరల్డ్‌ పాలిటిక్స్‌ దాకా అన్ని విషయాల మీద చర్చించుకుంటాం.. ఒకరినొకరం టీజ్‌ చేసుకుంటాం’ అంటుంది  డాక్టర్‌ ప్రేమ. ‘అందరూ ఒకే వయసు వాళ్లు కాదు కాబట్టి.. అందరూ తేలిగ్గా చేయగలిగే స్టెప్స్‌ను కంపోజ్‌ చేసి నేర్పిస్తున్నాను. వాళ్ల పట్టుదల చూస్తుంటే ముచ్చటేస్తోంది. పిల్లల్లా అల్లరి చేస్తారు.. జోక్స్‌ వేస్తూంటారు.. నవ్వుతారు... నవ్విస్తారు.. వీళ్లున్నంతసేపు టైమే తెలియదు. సందడిగా ఉంటుంది. కొత్త శక్తి వస్తుంది. వాళ్లు నా దగ్గర  నేర్చుకునే కంటే వీళ్ల దగ్గర నేను నేర్చుకునేదే ఎక్కువ’ అంటుంది వీళ్ల డ్యాన్స్‌ మాస్టర్‌ ఆఎల్‌వి మి«థున. అన్నట్టు ఈ డ్యాన్స్‌ స్కూల్‌ యానివర్సరీకి వీళ్లందరి చేత పెర్‌ఫార్మెన్స్‌ కూడా ఇప్పించబోతోంది ఈ టీచరమ్మ. అందుకు రిహార్సల్స్‌ కూడా మొదలెట్టేశారు ఈ బేబీలు.‘యూత్‌కి మేము ఎగ్జాంపుల్‌గా ఉండాలనుకుంటున్నాం..’ అంటారు ముక్తకంఠంతో. అన్నట్టు ఈ మధ్య హిట్టయిన ‘ఓ బేబీ’ సినిమా ఇలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిందేగా!