ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీఎం జగన్ మధ్య విరోధం ఉందో లేదో తెలియదు కానీ, సయోధ్య మాత్రం లేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఢిల్లీ స్థాయిలో పెద్దలందర్నీ కలిసిన సీఎం జగన్, ఒక్క వెంకయ్యని మాత్రం ఉద్దేశపూర్వకంగానే మిస్ చేశారు. ఆ తర్వాత ఇంగ్లిష్ మీడియం, మూడు రాజధానుల విషయంలో పరోక్షంగా వెంకయ్య చేసిన వ్యాఖ్యలు జగన్ కు మరింత కోపం తెప్పించాయి.
తాజాగా ఏపీలో ధాన్యం సేకరణ, కొనుగోలు వ్యవహారంపై ఉపరాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడు ఆరా తీసి, అధికారులతో నేరుగా మాట్లాడారట. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి మరింత మండింది. ఏపీ ప్రభుత్వ వ్యవహారాల్లో ఆ పెద్దాయన కాస్త ఎక్కువగా చొరవ చేసుకుంటున్నారంటూ సీఎం జగన్ మంత్రుల దగ్గర వ్యాఖ్యానించారు. ఆయన అలా హింట్ ఇచ్చారో లేదో, ఇలా మన యువమంత్రులు చెలరేగిపోయారు. కొడాలి నాని, కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్.. ఉపరాష్ట్రపతికి చురకలంటిస్తూ ఓ లేఖను రాశారు.
"అయ్యా ధాన్యం సేకరణ, చెల్లింపుల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమే అయినా, దానిపై మీరు చూపిన చొరవ రాష్ట్రానికి మంచి చేస్తుందని భావిస్తున్నాం. తెలుగు రైతులపై, ప్రజలపై మీకున్న ప్రత్యేక అభిమానం మాకెంతో సంతోషాన్నిస్తోంది. మీరు ఉపరాష్ట్రపతి అయినప్పటినుంచి ఇప్పటి వరకు ఏపీ అభివృద్ధి విషయంలో చూపిస్తున్న శ్రద్ధకు ధన్యాదాలు" అంటూ సుదీర్ఘంగా.. కాస్త వెటకారంగా ప్రశంసించారు. అంతటితో ఆగలేదు.. రైతుల కష్టాలపై చొరవ చూపినట్టే కాస్త కేంద్రం నుంచి రావాల్సిన 4724కోట్ల రూపాయల ధాన్యం బకాయిలు ఇప్పించాల్సిందని కోరారు. అంతే కాదు, పోలవరం నిర్మాణానికి, పునరావాసానికి నిధులు ఇప్పించేందుకు ఉపరాష్ట్రపతిగా చొరవ చూపించాలన్నారు.
వాస్తవానికి వెంకయ్యనాయుడు ఏ దశలోనూ ఏపీ అభివృద్ధికి కృషి చేయలేదనేది ప్రజలందరికీ తెలిసిన వాస్తవం. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ కు చేసింది ఏమీ లేదు. పైపెచ్చు ప్రత్యేక హోదా విషయంలో మాట దాటేశారు కూడా. సొంత పార్టీని ఎదగనివ్వకుండా, చంద్రబాబుకి చెంచాగిరీ చేశారు. ఇవన్నీ కనిపెట్టే ప్రధాని, ఆయనకి రాజ్యాంగ పదవి కట్టబెట్టి చేతులు కట్టేశారు.
అయినా కూడా ఏపీ విషయంలో ఆయన ఓవర్ యాక్షన్ ఆగలేదు. తన పరిధిలో లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ, ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై కామెంట్స్ చేస్తూ తన బుద్ధి చూపించుకున్నారు. ఇటీవల ఇలాంటి వ్యవహారాలు మరీ శృతిమించడంతో ఏకంగా మంత్రులు కౌంటర్ ఇచ్చారు. కేంద్రం నుంచి నిధులు తెప్పించి మీ పెద్దమనసు చాటుకోండి అంటూ లెటర్ రాశారు.